వాటర్ గ్రిడ్ పథకం పెండింగ్ పనులు పూర్తి చేయాలి
పులివెందుల రూరల్ : పులివెందుల వాటర్ గ్రిడ్ పథకానికి సంబంధించి పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ ఇన్‌చార్జి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్‌లు పేర్కొన్నారు. సోమవారం ఆర్డీఓ చిన్నయ్యను వారు వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి వాటర్ గ్రిడ్ పథకానికి సంబంధించిన పనులు త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.480 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. 2021 జూన్ నెలలో 299 గ్రామాలకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి తాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ కింద వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో శరవేగంగా వాటర్ గ్రిడ్ పనులు జరిగాయన్నారు. ఈ పథకానికి సంబంధించి లింగాల మండలం పార్నపల్లె వద్ద నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. అలాగే విద్యుత్ ఉప కేంద్రం కోసం దాదాపు 25 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్ పనులు మొదటి దశలో పూర్తి చేశారన్నారు. రెండో దశలో ఓవర్ హెడ్ ట్యాంకర్లు తదితర పనులు 90 శాతం మేర పూర్తయ్యాయని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి వరకు శరవేగంగా సాగిన పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. కాంట్రాక్టర్‌కు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా, మిగిలిన పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. కేవలం రూ.8కోట్లు ఖర్చుపెడితే మిగిలిన పెండింగ్ పనులన్నీ పూర్తయి పూర్తిస్థాయిలో పులివెందుల మున్సిపాలిటీకి ప్రతి ఇంటికి తాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ హాలు గంగాధరరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చిన్నప్ప, కౌన్సిలర్లు కోడి రమణ, కిశోర్, భార్గవి, రసూల్, కనక, వీరారెడ్డి, చంద్రమౌళి, ఖాదర్, కార్తీక్, సంపత్, మల్లికార్జున, పద్మనాభరెడ్డి, భాస్కర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


