దాల్మియా బాధితులకు న్యాయం చేయాలి
కడప సెవెన్‌రోడ్స్ : దాల్మియా సిమెంటు కర్మాగార నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, సీపీఐ జమ్మలమడుగు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎంవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ మైలవరం మండలం చిన్నకొమ్మెర్ల వద్ద నిర్మించిన దాల్మియా సిమెంటు ఫ్యాక్టరీలో భూములు కోల్పోయిన రైతులకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. చుట్టుపక్కల ఉన్న దుగ్గనపల్లె, నవాబుపేట, చిన్నకొమ్మెర్ల, పెద్ద కొమ్మెర్ల, తలమంచిపట్నం ప్రజలు బ్లాస్టింగ్ కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇళ్లన్నీ నెర్రెలు చీలి నివాసయోగ్యానికి వీలు లేకుండా పోతున్నాయన్నారు. దుమ్ము ధూళి వల్ల పంట దిగుబడి తగ్గిపోతోందన్నారు. దుగ్గనపల్లె రైతు మోషే తన మిరప పంటను గుంటూరు మార్కెట్‌యార్డుకు తీసుకెళ్లగా, అక్కడ నాణ్యత లేదని కొనకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆ కుటుంబానికి పరిహారం చెల్లించి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుమారు 35 వేల ఎకరాలకు నీరు పారే వంకకు అడ్డుగా కాంపౌండ్ వాల్ నిర్మించడం వల్ల వరద రైతుల పొలాలను ముంచెత్తుతోందన్నారు. ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ భూములు కోల్పోయిన రైతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదన్నారు. తొలుత రైతుల సమస్యలు పరిష్కరించిన తర్వాతే రెండవ ప్లాంటు విస్తరణ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జమ్మలమడుగు నియోజకవర్గ కార్యదర్శి ఎం.ప్రసాద్, జమ్మలమడుగు పట్టణ కార్యదర్శి రాంప్రసాద్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కట్టా యానాదయ్య, రైతులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట ఆందోళన


