‘తవ్వా‘కు వైఎస్సార్‌సీపీలో సముచిత స్థానం
కడప ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ సభ్యుడు, రాయలసీమ కథా సాహిత్య పరిశోధకుడు డాక్టర్ తవ్వా వెంకటయ్య చేసిన సేవలను గుర్తించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం హర్షనీయమని వైయస్సార్ జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి అన్నారు. సోమవారం వైఎస్సార్ కడప జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో తవ్వాను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత తన పదవీ కాలం ముగియకుండానే పార్టీ కోసం నైతిక బాధ్యత వహించి అధికార భాషా సంఘం సభ్యుడి పదవికి రాజీనామా చేసి పార్టీ పట్ల తనకు ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నారన్నారు. వైఎస్సార్ కడప జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జింకా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ డాక్టర్ తవ్వా వెంకటయ్య తెలుగు సాహిత్య రంగంలో ముఖ్యంగా కథా సాహిత్యానికి చేసిన పరిశోధన చాలా విలువైందన్నారు. రచయితల సంఘం కార్యవర్గ సభ్యుడు మధుర కవి డాక్టర్ వెల్లాల వెంకటేశ్వరాచారి మాట్లాడుతూ వెంకటయ్య తెలుగు సాహిత్య రంగంలోనే కాక, రాజకీయ రంగంలో కూడా తన ప్రతిభను నిరూపించుకోవడం అభినందనీయమన్నారు. సన్మాన గ్రహీత తవ్వా వెంకటయ్య మాట్లాడుతూ భవిష్యత్తులో ఆట, పాట, మాట ద్వారా పార్టీ ప్రతిష్టను ప్రజలలో పెంచుతానన్నారు. ఈ కార్యక్రమంలో మూగల రాజేష్, మేడిగ ఆల్ ఫ్రైడ్, ఓబులేసు పలువురు సాహిత్య మిత్రులు పాల్గొన్నారు.


