రాజోలి ఉన్నట్టా...లేనట్లా ?
కడప సిటీ : కుందూనదిపై నిర్మించతలపెట్టిన రాజోలి రిజర్వాయర్ ఉన్నట్లా..లేనట్లా? అన్న అనుమానం రైతాంగంలో కలుగుతోంది. 2004లో అధికారంలోకి వచ్చిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజోలి ఆనకట్ట నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంలో ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణరెడ్డి కూడా అందులో ఉన్నారు. ప్రస్తుత పరిహారం రైతులకు ఎకరాకు రూ. 12.50 లక్షలు ఇస్తామని అధికారులు తేల్చారు. ఇదిలా ఉండగా, ఎన్నికల హామీలో భాగంగా ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణరెడ్డి రూ. 25 లక్షలకు పరిహారం పెంచి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఆది హామీ నెరవేరలేదు. ప్రస్తుతం ఉన్న రూ. 12.50 లక్షలు కూడా ఏ రైతుకు అందకపోవడంతో అసలు రాజోలి ఆనకట్ట నిర్మిస్తారా? లేక ఎగనామం పెడతారా? అన్న అనుమానం కలిగి ఎవరికై నా ఇతరులకు అమ్ముకునేందుకు కూడా అవకాశం లేకపోవడంతో కనీసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని రైతులు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. భూ సేకరణ పూర్తయ్యాక, రేటు నిర్ణయించాక పరిహారం ఇవ్వడంలో జాప్యం జరగడంతో ఈ ఆలోచన రైతుల్లో మొదలైంది.
రాజోలి ఉన్నట్టా...లేనట్లా....?
కుందూ నదిపై రాజోలి వద్ద రిజర్వాయర్ నిర్మించేందుకు 2004లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. యేటా వృథాగా పోయే సుమారు 60 టీఎంసీల నీటిని ఒడిసి పట్టి అదనంగా వేలాది ఎకరాలకు నీరందించడంతో పాటు ప్రొద్దుటూరు పట్టణానికి తాగునీరు అందించడమే కాకుండా జమ్మలమడుగు పరిధిలోని ఉక్కు పరిశ్రమకు నీటి కేటాయింపులు కూడా ఈ ప్రాజెక్టు నుంచే నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ కారణంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. దివంగత వైఎస్సార్ మరణం తర్వాత వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీగానీ ఈ ప్రాజెక్టుపై ఎలాంటి నిర్మాణానికి పూనుకోలేదు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి సారించారు. ఇందుకు రూ. 1375.10 కోట్లు నిధులు అవసరమని తేల్చారు. టెండరులో ఈ పనులను ఎంఆర్‌కేఆర్, రిత్విక్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలు దక్కించుకున్నాయి. ఈ కంపెనీలు కుందూనది ప్రాంతంలో కొంత పనులు చేపట్టారు. కానీ బిల్లులు మాత్రం ఇంతవరకు మంజూరు కాలేదు. రాజోలికి పైన కర్నూలు జిల్లాలోని జొలదరాశి, కుందూ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ వ్యయాన్ని ఖర్చుపెట్టేందుకు నిర్ణయించారు.
రైతులకు అందని పరిహారం
రాజోలి ఆనకట్ట నిర్మాణం చేపట్టేందుకు జమ్మలమడుగు పరిధిలోని నెమ్మళ్లదిన్నె, ఉప్పలూరు, బలపనగూడూరు, గరిశలూరు, చిన్నముడియం గ్రామాలను ముంపు గ్రామాలుగా నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఇక్కడున్న ప్రజలంతా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాల్సి ఉంటుంది. ఎకరాకు రూ. 12.50 లక్షలు పరిహారం ఇస్తామని అధికారులు, రైతుల మధ్య పలు దఫాలు చర్చలు జరిగిన తర్వాత ఇందుకు అంగీకరించారు. కానీ పరిహారం మాత్రం ఇంతవరకు అందలేదు.
‘ఆది’ హామీ ఏమైంది?
అమ్మకు బువ్వ పెట్టనోడు...పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్న సామెత ఉంది. రాజోలి పరిహారం విషయంలో కూడా ఈ సామెత వర్తించేలా కనిపిస్తోంది. ప్రకటించిన రూ. 12.50 లక్షలు పరిహారం ఇవ్వకపోగా, ఎన్నికల్లో భాగంగా ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అంతకు రెడింతలు పెంచి రూ. 25 లక్షలు ఎకరాకు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 17 నెలలు దాటింది. అసలు ఆది హామీ నెరవేరుస్తారా? లేదా? అన్న అనుమానం రైతాంగంలో వ్యక్తమవుతోంది.
రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతులు
రాజోలి ఆనకట్ట నిర్మాణానికి అధికారులు భూ సేకరణ చేపట్టారేగానీ ఆనకట్ట కట్టింది లేదు.. రైతులకు పరిహారం ఇచ్చింది లేదు.. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1బీ, అడంగల్ మాత్రమే వస్తోందని, రిజిస్ట్రేషన్ కాకుండా అధికారులు హోల్డ్‌లో పెట్టడం వల్ల భూములు అమ్ముకునేందుకు కూడా వీలు లేకుండా పోయిందని ఆందోళనలో ఉన్నారు
భూ సేకరణతో ఆగిన
రాజోలి ఆనకట్ట పనులు
ఇంతవరకు ఏ ఒక్క రైతుకు అందని పరిహారం
ఎన్నికల్లో ఎకరాకు రూ. 25 లక్షలు
పరిహారం ఇస్తామని ‘ఆది’ హామీ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలైనా రాజోలి ఊసే లేని వైనం
నిరాశ నిస్పృహల్లో రైతాంగం
రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని రైతుల విజ్ఞప్తి
రాజోలి ఉన్నట్టా...లేనట్లా ?


