మా కార్యకర్తలకు అన్యాయం జరిగితే రెండు వేల మందితో వస్తా
కడప కార్పొరేషన్ : వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే 200 మందితో కాదు 2వేల మందితోనైనా వస్తానని, అక్రమ కేసులకు, అరెస్టులకు భయపడబోమని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా హెచ్చరించారు. శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి, ఆమె భర్త, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిలపై నిప్పులు చెరిగారు. కడప నగర అభివృద్ధిపై ఆ భార్యాభర్తలకు ధ్యాసలేదన్నారు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన ఈ ఒకటిన్నర సంవత్సరంలో వీళ్లు చేసిన ఘనకార్యాలు ఏంటంటే... బుగ్గవంకను ఏటీఎంలా మార్చుకున్నారని, రూ.3.60 కోట్లు ఖర్చు చేసి బుగ్గవంకలో చెట్లు పీకారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అవి మళ్లీ యథావిధిగా పెరిగాయన్నారు. కడప నగర ప్రథమ పౌరుడైన సురేష్ బాబు ఇంటిపై చెత్త వేయించి కడపలో చెత్త రాజకీయాలు, చెత్త సంస్కృతిని తీసుకొచ్చారన్నారు. తమ చుట్టూ దండు పాళ్యం బ్యాచ్‌ను తయారు చేసుకున్నారని, ఆ బ్యాచ్ కడపను వాటాలుగా పంచుకొని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి వారు రేపు కార్పొరేటర్లు అయితే కడప పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఎమ్మెల్యేకు, ఆమె భర్తకు కడప అభివృద్ధిపై చిత్తశుద్ది ఉంటే తమ ప్రభుత్వంలో కడపకు శాశ్వతంగా తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలని బ్రహ్మం సాగర్ నుంచి 1.5 టీఎంసీలను కేటాయించి, రూ.570 కోట్లతో తీసుకొచ్చిన స్కీంను పూర్తి చేయించాలని సవాల్ విసిరారు. దావత్ అంటే తెలియని వారు దాని గూర్చి మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. డాక్టర్లు, ఫార్మసిస్టులు, మైనింగ్, రియల్ వ్యాపారులు, వైన్‌షాపులు, బార్ల యజమానులు, చివరకు తోపుడు బండ్ల వారి దగ్గరి నుంచి కూడా శవాలపై చిల్లర ఏరుకునేది మీరేనని ఆరోపించారు. టీడీపీలోకి తనకు రెండు సార్లు ఆహ్వానం వచ్చినా నైతిక విలువలకు కట్టుబడి పార్టీ మారలేదని, కానీ శ్రీనివాసులరెడ్డి ఏ గాలికి ఆ చాప, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేరకమని ఎద్దేవా చేశారు. రాబోవు రోజుల్లో తమదనే రోజు వస్తుందని, ఎవరి నోటికి తాళం వేయాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. .
మేం చేసిన అభివృద్ది ఇదీ...
ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తాము ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని, ఏడు రహదారులను విస్తరణ చేసి 10 అందమైన సర్కిళ్లు నిర్మించామన్నారు. రిమ్స్‌ను మల్టీ స్పెషాలిటీ హాస్సిటల్‌గా అప్‌గ్రేడ్ చేసి, మానసిక వైద్యశాల, కేన్సర్ ఆసుపత్రి, ఎల్వీ ప్రసాద్, పుష్పగిరి కంటి ఆసుపత్రులను తీసుకొచ్చామన్నారు. 12 పీహెచ్‌సీలు నిర్మించి, ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం చేశామని, రూ.69 కోట్లతో 23 వరదనీటి కాలువలు నిర్మించామన్నారు. రూ.58 కోట్లతో బుగ్గవంక ప్రహరీ నిర్మాణం పూర్తి చేసి, బుగ్గవంకపై నాగరాజుపేట, షహమీరియా మసీదు వద్ద బ్రిడ్జిల నిర్మాణానికి రూ.20కోట్లు మంజూరు చేయించామన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పి. జయచంద్రారెడ్డి, దాసరి శివప్రసాద్, టీపీ వెంకట సుబ్బమ్మ, షఫీ, బాలస్వామిరెడ్డి, త్యాగరాజు, కిరణ్, బసవరాజు, రమేష్‌రెడ్డి, సింధేరవి, నాగేంద్ర(బుజ్జి), కంచుపాటి బాబు, ఎస్. బాదుల్లా పాల్గొన్నారు.
కడప అభివృద్ధిపై మీకు ధ్యాస లేదు
శవాలపై చిల్లర ఏరుకునేది మీరే
బుగ్గవంకను ఏటీఎంగా
మార్చుకున్నారు
దండు పాళ్యం బ్యాచ్‌ను తయారు చేసి కడపను పంచుకున్నారు
ఎవరి నోటికి తాళం వేయాలో ప్రజలే నిర్ణయిస్తారు
కడప ఎమ్మెల్యే మాధవి, శ్రీనివాసులరెడ్డిపై నిప్పులు చెరిగిన మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా


