విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
రాజుపాళెం : మండల పరిధిలోని కొర్రపాడు గ్రామానికి చెందిన ఎత్తపు శ్రీనివాసులరెడ్డి (50) అనే వ్యక్తి శనివారం విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు ఎస్‌ఐ వెంకటరమణ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాసులరెడ్డి తన ఇంటిలో అమర్చుకున్న ఇన్వర్టర్ బ్యాటరీకి ఉన్న విద్యుత్ వైర్లను తీస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ కొట్టి పడిపోయాడు. అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి శ్రీనివాసులరెడ్డి మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
కూటమి వర్గీయుల మధ్య ఘర్షణ
ముద్దనూరు : కూటమి వర్గీయుల మధ్య శనివారం సాయంత్రం ఘర్షణ జరిగింది. స్థానికంగా నిర్మిస్తున్న సెంట్రల్ కిచెన్ షెడ్డు విషయంలో ఇరు వర్గాలకు చెందిన వారు ఘర్షణకు దిగినట్లు, ఈ ఘర్షణలో ఒక వ్యక్తికి గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కేబుల్ వైర్ల దొంగలు అరెస్టు
పులివెందుల రూరల్ : పులివెందుల నియోజకవర్గంలోని లింగాల, తొండూరు, సింహాద్రిపురం, పులివెందుల మండలాల్లోని గ్రామాల్లో రైతుల పొలాల వద్ద ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి కేబుల్ వైర్లను దొంగలించిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ తెలిపారు. శనివారం పట్టణంలోని స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆయన సీఐ ఎన్వీ రమణతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బెంగళూరుకు చెందిన జాఫర్ షరీఫ్. రషీద్‌లతోపాటు సురేంద్ర అనే ముగ్గురు వ్యక్తులు డ్రైవర్లు, క్లీనర్లుగా పనిచేస్తూ నియోజకవర్గంలోని అరటి తోటల రైతుల వద్దకు వెళ్లి ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్ కేబుల్ వైర్లను అపహరించి తీసుకెళ్లి బెంగుళూరులో విక్రయించేవారన్నారు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారని, ఈ నేపథ్యంలో రూరల్ సీఐ రమణ, లింగాల ఎస్‌ఐ అనిల్ కుమార్‌ల ఆధ్వర్యంలో వీరిని అరెస్టు చేశామన్నారు. సుమారు రూ.3లక్షలు విలువ చేసే కాపర్ వైర్లతోపాటు మోటార్లకు సంబంధించిన కేబుల్ వైర్లను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి


