● జిల్లా అంతటా వర్షం
కడప అగ్రికల్చర్: మొన్న ఖరీఫ్‌లో జరిగిన పంట నష్టం నుంచి అన్నదాత ఇంకా కోలుకునేలేదు.. నిన్న మోంథా తుపాన్ చేసిన గాయమా ఇంకా మానలేదు..ఇంతలోనే మరో ‘తుపాన్’ ముంచేకొస్తుందంటూ అధికారులు చేస్తున్న ప్రకటనతో రైతుల్లో గుబులు మొదలైంది. పంట చేతికొచ్చే చి‘వరి’ దశలో అన్నదాత ఆశలపై వర్షం గండికొట్టేలా ఉంది. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షం వరి కోత మొదలు పెట్టిన రైతుల్లో కలవరపరుస్తోంది. దీంతో పాటు శనగ, పత్తి, రైతుల్లో కూడా ఆందోళన నెలకొంది. తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో వరి కోత పనులను నాలుగు రోజులు వాయిదా వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ రైతులను సూచించారు.
చినుకు.. కంటిపై కునుకు లేకుండా...
సెన్యార్ తుపాన్ హెచ్చరికలు రైతులను నిద్ర లేకుండా చేస్తున్నాయి. జిల్లాలో చాలా చోట్ల వరి పంట చిరుపొట్ట, కోత దశల్లో ఉంది. దీంతో ప్రస్తుతం కురుస్తున్న వాన చినుకులు.. ఈ తుపాన్ హెచ్చరికలు అన్నదాతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే వరి కోతలను ప్రారంభించిన రైతన్నల్లో అలజడి మొదలైంది. కొంతమంది రైతులు కోసిన వరి ధాన్యాన్ని రోడ్లుపైన, మెట్టప్రాంతాల్లో ఆరుబెట్టుకుంటున్నారు. కానీ వర్షం దాగుడుమూతలు ఆడుతుండడంతో రైతులు ఆందోళన పడుతున్నారు. పచ్చిధాన్యం కావడంతో పట్టల కింద రెండు మూడు రోజులు ఉంచితే ఉక్కతో దెబ్బతినే ప్రమాదం ఉంటుందని రైతులు దిగాలు పడుతున్నారు.
అక్కడక్కడ నేలకొరుగుతున్న వరిపంట...
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పూర్తిగా కోతకు సిద్ధంగా ఉన్న వరిపంట పలు చోట్ల నేలకొరుగుతోందని రైతులు తెలిపారు. వరిపంటలో అంతో ఇంతో నెమ్ము ఉంటుంది. పైగా ఈ వర్షం కారణంగా నేల మరింత నెమ్ము వచ్చే అవకాశం ఉండటంతో కిందపడిన వరి కంకులకు మొలకలు వచ్చే అవకాశం ఉండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం చాపాడు, ప్రొద్దుటూరు, మైదుకూరు, సిద్దవటం, ఖాజీపేటలతోపాటు పలు మండలాల్లో అక్కడక్కడ వరికోతలను ప్రారంభించారు.
శనగ, మినము, నువ్వు రైతల్లో గుబులు.....
మోంథా తుపాన్‌కంటే ముందు కురిసిన పదును వర్షాలకు చాలా మంది రైతులు మినుము, శనగ, నువ్వు పంటలను సాగు చేసుకున్నారు. తరువాత మెంథా తుపాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా కురి సిన వర్షాలకు మినుము, శనగ, పత్తి చాలా చోట్ల తెబ్బతింది. ఆ తరువాత చాలా మంది రైతులు దెబ్బతిన్న ఆరుతడి పంటలను దున్నేసి మళ్లీ మినుము, శనగ, నువ్వు పంటలను సాగు చేసుకున్నారు. తాజాగా కురుస్తున్న వర్షాలతోపాటు సెన్యార్ తుఫాన్ హెచ్చరికలతో ఆ రైతుల్లో గుబులు నెలకుంది. వరుస తుఫాన్‌లు రైతులను కకావికలం చేస్తున్నాయి.
మోంథా గాయం మానకముందే ముంచుకొస్తున్న మరో తుపాన్
జిల్లాలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు
రైతుల్లో అందోళన.. కోతలను వాయిదా వేసుకోవాలంటున్న అధికారులు
కడప అగ్రికల్చర్: ఉపరితల ఆవర్తనం కారణంగా శనివారం జిల్లా అంతటా వర్షం కురిసింది. జిల్లాలోని ముద్దనూరు మండలం మినహా మిగతా అన్ని మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో అత్యధికంగా పెండ్లిమర్రిలో 37.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే ఒంటిమిట్టలో 35.4 మి.మీ, వేములలో 35, కడపలో 27.4, వల్లూరులో 24.8, ఆట్లూరులో 24.2, సికెదిన్నెలో 23.4, జమ్మలమడుగులో 20.4 , సిద్దవటంలో 17.4 , చెన్నూరు, ఖాజీపేటలలో 16.4, పులివెందుల్లో 15, కలసపాడు, కమలా పురంలలో 14.2, చక్రాయపేటలో 12.2, గోప వరంలో 12, వేంపల్లి, వీఎన్‌పల్లిలలో 9.6, బి.మఠంలో 8.2, రాజుపాలెంలో 8, బద్వేల్‌లో 7.2 , మైలవరం, దువ్వూరులలో 6.4, వేంపల్లి, బి.కోడూరులలో 4.6, పోరుమామిళ్ల, చాపాడులలో 4.2, కాశినాయనలో 4 , సింహాద్రిపురం, కొండాపురంలలో 3.4, పెద్దముడియంలో 3.2, మైదుకూరులో 3, తొండూరులో 2.4, ముద్దనూరు, ఎర్రగుంట్లలో 1 మి.మీ వర్షం కురిసిందని అధికారులు వెల్లడించారు.


