బచావత్ ట్రిబ్యునల్‌పై సమీక్ష చట్టవిరుద్ధం
కడప కార్పొరేషన్: బచావత్ ట్రిబుల్ అవార్డుపై పునః సమీక్ష చేయడం అంతర్ రాష్ట్ర నదీజల వివాదాల చట్ట ప్రకారం విరుద్ధమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించడంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నా రు. కేడబ్ల్యూడిటీ–2లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున దాఖలు చేసిన అఫిడవిట్టే ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కృష్ణా జలాల్లో 763 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ సర్కార్ వాదిస్తోందని, ట్రిబ్యునల్ విచారణ చేస్తుండగానే అదనంగా 372.54 టీఎంసీలు తరలించేలా, 16 ప్రాజెక్టులు చేపట్టేందుకు తెలంగాణ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు సర్కారు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. బచావత్ ట్రిబ్యునల్ ఏపీకి కేటాయించిన 512 టీఎంసీల నికర జలాల్లో.. ఒక్క టీఎంసీ తగ్గినా చంద్రబాబే బాధ్యత వహించాలని హెచ్చరించారు. అదే జరిగితే రాయలసీమ ఎడారిగా మా రుతుందని తెలిపారు. 1995–2004 మధ్య చంద్రబాబు నిర్వాకం వల్లే కర్ణాటక సర్కార్ ఆల్మట్టి ఎత్తును 524.25 మీటర్లకు పెంచేసిందని, ఇప్పుడు నీటి నిల్వ ఎత్తును 519.6 నుంచి 524.25 మీటర్లకు పెంచే దిశగా అడుగులు వేస్తోంది.. దీని వల్ల ఆల్మట్టిలో అదనంగా వంద టీఎంసీలు నిల్వ చేసే అవకాశం ఉంటుందన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలోని రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంటుందని విమర్శించారు. మోంథా తుపాను వల్ల లక్షలాది పంట నష్టం జరిగిందన్నారు. ఆ పంట నష్టం కూడా ప్రభుత్వం అంచనా వేయలేకపోతోందన్నారు. అరటి రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారని, టన్ను రూ.30వేలు పలికే అరటి రూ.500లకు కూడా అమ్ముడుపోవడం లేదని, అంటే కేజీకి రూ.50పైసలు కూడా రావడం లేదన్నారు. ఇంత దారుణంగా రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం చేష్టలుడిగి చూడటం దారుణమన్నారు. ఇప్పటికై నా మేలుకొని రైతులను ఆదుకోకపోతే వైఎస్సార్‌సీపీ తరఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో ఇంత నిర్లక్ష్యమా?
అదే జరిగితే రాయలసీమ ఎడారిగా మారుతుంది
అరటి రైతులను వెంటనే ఆదుకోవాలి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్


