‘గండికోట’అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
కలెక్టర్ శ్రీధర్
కడప సెవెన్‌రోడ్స్: సాస్కి పథకం ద్వారా గండికోట పర్యాటక కేంద్రానికి ప్రపంచ స్థాయిలో కీర్తిని ప్రతిబింబించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేయనున్నామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్ హాల్లో గండికోట పర్యాటక అభివృద్ధి పనులపై డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, జిల్లా పర్యాటక శాఖ, ఏపీ టీడీసీ అధికారులు, కాంట్రాక్టు ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండికోట పర్యాటక కేంద్రంలో సుసంపన్నమైన కోట, గార్జ్ అనుభవాన్ని పర్యాటకుల సొంతం చేసే దిశగా జిల్లా యంత్రాంగం పర్యాటక శాఖ ద్వారా అభివృద్ధి పనులకు నాంది పలికిందన్నారు. జనవరి నెలలో గండికోట ఉత్సవాల నిర్వహణకు ముందే పూర్తికావాల్సిన ఎంట్రన్స్, వెలివేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీటీడీసీ ఇంజనీర్లు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌లను ఆదేశించారు. ఈ సందర్భంగా గండికోట పర్యాటక కేంద్రం అభివృద్ధి పథకంలో భాగంగా చేపట్టే అన్ని రకాల పనులకు సంబంధించి మ్యాపులను, డిజైన్లను పరిశీలించి పలు సూచనలు, సలహాలను అందించారు. గండికోట ప్రాంతాన్ని సాస్కీ పథకం ద్వారా రూ.79 కోట్లతో అభివృద్ధి చేసి అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభు త్వం ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. గ్రాండ్ కాన్యన్‌ను ఆకాశం నుంచి వీక్షించేందుకు హెలీరైడ్స్ సదుపాయం కూడా కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లా టూరిజం అధికారి సురేష్ కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఏడుకొండలు, ఏపీటీడీసీ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యం రాజు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెంచలయ్య, కన్సల్టెంట్లు సాజిత్ షేక్, సుమన్ దాస్, విజయ్ కుమార్ బండి, కాంట్రాక్ట్ ప్రతినిధి శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.


