జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం
18 నెలల నుంచి కౌంటర్ దాఖలు చేయని ప్రభుత్వం
● చంద్రబాబు అధికారంలోకి రాగానే కక్ష
● నిర్మాణ సంస్థ రాక్రీట్‌కు బిల్లులు నిలుపుదల
● ఎక్కడికక్కడే ఆగిన పనులు
● పూర్తి చేయాలని కోరుతున్న
లబ్ధిదారులు
● ఆర్డీఓకు వైఎస్సార్‌సీపీ నాయకుల వినతి
పులివెందుల : పులివెందులలోని జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాల్లో అంతులేని జాప్యం జరుగుతోందని మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ అన్నారు. స్థానిక మినీ సెక్రటేరియట్‌లోని ఆర్డీఓ కార్యాలయంలో ఉన్న ఆర్డీఓ చిన్నయ్యకు వారు వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి శుక్రవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2020లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో జగనన్న హౌసింగ్ కాలనీలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో పులివెందుల పట్టణంలో అన్ని వసతులతో కూడిన దాదాపు 8 వేల గృహాల ఏర్పాటు కోసం జగనన్న మెగా హౌసింగ్ కాలనీకి శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మంచి పేరు వస్తుందనే కుట్రపూరిత ఉద్దేశంతో కొంత మంది టీడీపీ నాయకులు కోర్టులో కేసు వేశారని పేర్కొన్నారు. గృహ నిర్మాణాలు ప్రారంభం కాకుండా కోర్టు నుంచి స్టే తెచ్చారని తెలిపారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత కోర్టు తీర్పుతో 2021లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హౌసింగ్ కాలనీకి శంకుస్థాపన చేశారన్నారు. త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో చదరపు అడుగుకు రూ.1800 చొప్పున అత్యంత తక్కువ ధరకు ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలని.. రాక్రీట్, డీఈసీ కంపెనీలకు పులివెందుల పట్టణంలోని గృహాల నిర్మాణ బాధ్యతలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో గృహ నిర్మాణ పనులు అప్పగించడం జరిగిందన్నారు. 2022 మార్చిలో ఊపందుకున్న గృహ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతూ 2024 జనవరి వరకు దాదాపు 6795 గృహాలు వివిధ నిర్మాణ దశలలో పురోగతి సాధించడం జరిగిందన్నారు.
నిర్మాణ సామగ్రిని చోరీ చేస్తున్న వైనం
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాక్రీట్ సంస్థ గృహ నిర్మాణాల కోసం పులివెందుల మెగా హౌసింగ్ కాలనీలో పెద్ద ఎత్తున సిద్ధం చేసుకున్న సిమెంట్, ఇటుకలు, కంకర, భారీస్థాయి కాంక్రీట్ పరికరాలు, మోటార్లు వంటి వాటిని కొంత మంది టీడీపీ నాయకులు, అనుచరులు అక్రమంగా దొంగలించి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అంతటితో ఆగక పులివెందుల మినహా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గృహ నిర్మాణాలకు రూ.38 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉండగా, రాక్రీట్ సంస్థకు ఒక్క రూపాయి బిల్లు కూడా ఇవ్వకుండా కక్ష పూరితంగా వ్యవహరించడంతో నిర్మాణ పనులు పూర్తిగా ఆగిపోయి అటకెక్కడం జరిగిందన్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని, లేదంటే బిల్లులు చెల్లిస్తామనే హామీ రాతపూర్వకంగా కోర్టు ద్వారా ఇస్తే పనులు పూర్తి చేస్తామని రాక్రీట్ సంస్థ 18 నెలల క్రితం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం జరిగిందన్నారు.
లబ్ధిదారులను గందరగోళానికి గురి చేసే కుట్ర
లబ్ధిదారుల(కాంట్రిబ్యూషన్)వంతుగా జమ రూ.35 వేల డబ్బుపై లేనిపోని ఆరోపణలు చేస్తూ లబ్ధిదారులను భయాందోళనకు గురి చేస్తున్న టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని, వారు జమ చేసిన డబ్బు మున్సిపల్ కమిషనర్ ఖాతాలో ఉన్నాయనే వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, మున్సిపల్ కమిషనర్‌తో ప్రజలకున్న సందేహాలను నివృత్తి చేయించాలన్నారు. పులివెందుల పురపాలక పరిధిలో పేదల గృహ నిర్మాణాల కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న మెగా హౌసింగ్ కాలనీపై చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న కక్షపూరిత ధోరణి విరమించుకోవాలన్నారు. పేదల కోసం చేపట్టిన ఈ బృహత్తర ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసేందుకు ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేయాలన్నారు. జగనన్న హౌసింగ్ కాలనీని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలన్నారు. లేనిపక్షంలో ప్రజల తరఫున వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చిన్నప్ప, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధరరెడ్డి, ఉపాధ్యక్షుడు పార్నపల్లె కిశోర్, కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్లు, వైఎస్సార్‌సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
పులివెందుల పట్టణంలో ప్రజల శ్రేయస్సు దృష్ట్యా నిర్మించే గృహ నిర్మాణాలు పూర్తి కావాలని ఏ మాత్రం చిత్తశుద్ధిలేని ఈ స్థానిక టీడీపీ నాయకులు కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ రాక్రీట్ సంస్థ వేసిన అఫిడవిట్‌కు 18 నెలలు కావస్తున్నా కౌంటర్ దాఖలు చేయలేదని పేర్కొన్నారు. కోర్టులో కౌంటర్ దాఖలు చేస్తే ఇంకో 9 నెలల్లో గృహ నిర్మాణ పనులు పూర్తయ్యి ప్రజలు పూర్తి స్థాయిలో గృహ ప్రవేశాలు చేసుకునే పరిస్థితి ఉందన్నారు. ఈ కౌంటర్ దాఖలు చేయాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కలెక్టర్, సంబంధిత అధికారుల దృష్టికి ఎన్నో సార్లు తీసుకెళ్లినా స్పందించడం లేదన్నారు. కౌంటర్ దాఖలు చేయకపోవడం వెనుక పులివెందుల ప్రజలపై టీడీపీ ప్రభుత్వ కపట ప్రేమ తేటతెల్లమవుతోందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క గృహ నిర్మాణం కూడా జరగకుండా నీతిమాలిన రాజకీయాలు చేస్తోందన్నారు. సీవేజ్ లాంటి సదుపాయాలు పూర్తి కాకపోవడం వలన జగన్ ప్రభుత్వంలో పూర్తయిన 800పై చిలుకు గృహాలలో కూడా లబ్ధిదారులు గృహ ప్రవేశం చేయలేని పరిస్థితి ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో దాదాపు రూ.140 కోట్లతో ఈ కాలనీలో రోడ్లు, విద్యుత్ లైన్లు, బోర్లు, పైపులైన్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టి దాదాపు 75 శాతం పనులు పూర్తి చేశారని తెలిపారు. ఆ కాంట్రాక్టర్‌కు కూడా చంద్రబాబు సర్కారు బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.


