ఏబీఎన్ ప్రతినిధులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏబీఎన్ ప్రత్యక్ష ప్రసార డిబెట్‌లో అత్యంత ప్రమాదకరమైన, బాధ్యతా రాహిత్యమైన చట్టవ్యతిరేక వ్యాఖ్యలు చేశారని, వారిపై చట్టప్రకారం తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్‌కుమార్ కోరారు. శుక్రవారం సాయంత్రం చిన్నచౌకు పోలీసుస్టేషన్‌లో ఈ మేరకు ఎస్‌ఐ రవికుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పులి సునీల్‌కుమార్ మాట్లాడుతూ నిన్నటి రోజు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ చానల్‌లో ప్రత్యక్ష ప్రసారంగా రాజకీయ చర్చ (డిబెట్) సమయంలో అడుసుమిల్లి శ్రీనివాసరావు అనే రాజకీయ విశ్లేషకుడు.. మాజీ ముఖ్యమంత్రి, ప్రజాభిమానంతో ఎన్నుకోబడిన నాయకుడైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అత్యంత ప్రమాదకరమైన, బాధ్యతా రహితమైన, చట్టవ్యతిరేకమైన వ్యాఖ్య చేశారన్నారు. ప్రత్యక్ష ప్రసారంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నక్సలైట్‌తో పోలుస్తూ ఇలాంటి వారిని నక్సల్స్‌లా ఎన్‌కౌంటర్ చేయాలని తదితర బెదిరింపుతో కూడిన మాటలు చెప్పారన్నారు. ఇది కేవలం అవమానకర వ్యాఖ్య కాదని, ఒక వ్యక్తి ప్రాణం తీసేలా ప్రజల్లో ప్రేరణ కలిగించే అత్యంత తీవ్రమైన నేర పూరిత ప్రకటన అన్నారు. ఈ వ్యాఖ్యలు మాట్లాడిన వెంటనే కార్యక్రమాన్ని నడిపిన ఏబీఎన్ యాంకర్, అసోసియేషన్ ఎడిటర్ రుషిమర్ల మాటలను ఆపడం, నిలదీయడం, నిరసించడం, నియంత్రించడం చేయకుండా ప్రత్యక్షంగా ఆయన వాదనలకు మద్దతు ఇచ్చే విధంగా ప్రవర్తించారన్నారు. యాంకర్ బాధ్యత విశ్లేషకులను సమతూకంగా ఉంచడం, చట్టవ్యతిరేకమైన వ్యాఖ్యలను అడ్డుకోవడం అయినప్పటికీ ఆయన అలా చేయకుండా ప్రసారాన్ని కొనసాగించారన్నారు. ఇది ఆ వ్యాఖ్యలకు ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా హింస, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు మీడియా వేదికగా ఉపయోగించుకునే అవకాశం కల్పించడమేనన్నారు. ఇందులో యాంకర్ మాత్రమే కాదని, పాల్గొన్న కనపర్తి శ్రీనివాసరావు, కృష్ణకాంత్, ఎడిటర్లు, ప్రొడ్యూసర్లు, ఏబీఎన్ చానల్ మేనేజ్‌మెంట్ స్పష్టంగా సహ నిందితులుగా వ్యవహరిస్తూ ఆ వ్యాఖ్యలను దేశ ప్రజలకు చేరేలా అనుమతించారన్నారు. ఈ విషయంగా పైన పేర్కొన్న వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు బాబు, త్యాగరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, వైఎస్సార్ టీయూసీ జిల్లా అధ్యక్షుడు జాషువా, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు బాబు, వైఎస్సార్ సీపీ టీయూసీ నగర అధ్యక్షులు నాగరాజు, మైనార్టీ కార్యదర్శి ఫయాజ్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు యనమల రవి, జనరల్ సెక్రటరీ అజయ్, మాజీ జిల్లా అధ్యక్షుడు వినోద్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ నాయకుల ఫిర్యాదు


