సంతృప్త స్థాయిలో జిల్లా అభివృద్ధి జరగాలి
కడప సెవెన్‌రోడ్స్ : ఆకాంక్ష జిల్లాల లక్ష్య సాధనలో కడప పురోగమనంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అన్ని అంశాల్లో సంతృప్త స్థాయిలో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండర్ టేకింగ్ కమిటీ (పీఏసీ) చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో వివిధ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులు, సదుపాయాలు సక్రమంగా ప్రజలకు చేరవేయడంలో అధికారులదే బాధ్యత అన్నారు. జిల్లాలో చాలా మేరకు అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయని, అధికారులు బాధ్యత తీసుకుని పూర్తి చేయాలన్నారు. విద్య, నైపుణాభివృద్ధి, సాంకేతిక, పారిశ్రామిక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా అభివృద్ధి లక్ష్యసాధనలో పీఏసీ తనవంతు సహకారం అందిస్తుందన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం శాస్త్ర సాంకేతిక పరిశోధనలు, లలిత కళల అభివృద్ధిలో మరింత ప్రాచుర్యం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ట్రిపుల్ ఐటీలో సర్టిఫికెట్ కోర్సులు కూడా నిర్వహిస్తే చాలా మందికి సాంకేతిక నైపుణ్య సామర్థ్యం అందుతుందని సూచించారు. ఏపీ టూరిజం నిధులతో పాడా నిర్మించిన భవనాన్ని పరిశీలించి ప్రభుత్వ స్వాధీనం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. పార్నపల్లె రిజర్వాయర్ వద్ద కొత్తగా నిర్మించి ఇరిగేషన్ శాఖకు అప్పగించిన భవనాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని పర్యాటకశాఖకు అప్పగించాలన్నారు. ప్రపంచ పర్యాటక మ్యాప్‌లో గండికోటకు ప్రత్యేక గుర్తింపు తీసుకు రావాలన్నారు. పర్యాటక పరంగా అపారమైన వనరులు, అవకాశాలు ఉన్నాయని, వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు పామర్రు ఎమ్మెల్యే వర్లకుమార రాజా, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, కలెక్టర్ శ్రీదర్ చెరుకూరి, జేసీ అదితిసింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పీఏసీ చైర్మన్ కూన రవికుమార్


