మేం చెప్పిన పని చేయాల్సిందే..
రెండో రోజూ సెక్యూరిటీ గార్డులతో చాకిరి చేయించిన అధికారులు
ప్రొద్దుటూరు క్రైం : బానిసత్వం అంటే ఏంటో చాలా మందికి తెలియదు. ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాసుత్రికి వస్తే బానిసత్వం అనే పదానికి సరైన నిర్వచనం తెలుస్తుంది. ఇక్కడి కింది స్థాయి సిబ్బంది అయిన సెక్యూరిటీ గార్డులతో అధికారులు బలవంతంగా చాకిరి చేయిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆస్పత్రిలోని వివిధ విభాగాలకు మరమ్మతులు చేయాల్సి ఉంది. అయితే ఆయా విభాగాల్లో ఉన్న పరికరాలను మరో చోటికి తరలించాలి. అన్ని విభాగాలను ఖాళీ చేస్తే పనులు ప్రారంభిస్తామని కాంట్రాక్టర్ తెగేసి చెప్పేశాడు. ఆస్పత్రి అధికారులు మరోమాట మాట్లాడలేదు. ఒక గంటో, రెండు గంటల్లో అయిపోయే పని అయితే అందరూ తలో చెయ్యివేసి చేసుకోవచ్చు. అయితే నాలుగైదు రోజుల పాటు పని చేసినా పరికరాలు తరలించే ప్రక్రియ పూర్తి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో బయటి నుంచి పని వారిని పిలిపించి ఆస్పత్రికి సంబంధించిన పనులను చేయించాల్సి ఉంది. ఎందుకో మరి ఆస్పత్రి అధికారులు ఆ దిశగా ఆలోచించలేదు. మేం చెప్పిన ఏ పనైనా చేయాల్సిందేనని చిరు ఉద్యోగులపై బెదిరింపులకు దిగుతున్నారు. దగ్గరుండి మరీ సెక్యూరిటీ సిబ్బందితో పనులు చేయిస్తున్నారు. ఇది తమ పని కాదని మొత్తుకున్నా వారు కనికరించలేదు. మన పనులు మనం చేసుకుంటే తప్పేంటని కొందరు అధికారులు నీతులు వల్లిస్తున్నారు.
రెండు రోజులుగా గొడ్డు చాకిరి..
ఆస్పత్రిలో సెక్యూరిటీ వ్యవస్థ అనేది చాలా కీలకమైంది. ఆస్పత్రిలోని ఏ ఒక్క పరికరం బయటికి వెళ్లకుండా కాపలా కాయాల్సిన బాధ్యత సెక్యూరిటీ గార్డులదే. జిల్లా ఆస్పత్రిలో 55 మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. ఉదయం షిఫ్ట్‌లో 28 మంది పని చేస్తారు. సెక్యూరిటీ విధులను పక్కన పెట్టించి వారితో అధికారులు పనులు చేయిస్తున్నారు. గురువారం, శుక్రవారం సెక్యూరిటీ సిబ్బంది ఓటీ మిషన్లు, మంచాలు, కుర్చీలు, ఏసీలు, బీరువాలు, ఇతర బరువైన పరికరాలను కంటి విభాగం నుంచి మరో చోటికి తరలించారు. ఎవరైనా ఎదురు తిరిగితే ఎమ్మెల్యేకు చెబుతాం అంటూ అధికారులు బెదిరింపులకు దిగుతున్నారు. పాపం చిరు ఉద్యోగులు నోరు మెదపకుండా చాకిరి చేయాల్సి వచ్చింది. కార్మికులకు చట్టాలు ఉన్నా అవి ఎందుకు పనికి రావనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. చట్టాలను కాపాడాల్సిన అధికారులే కాలరాస్తున్నారని పలువురు వాపోతున్నారు.


