రాజంపేటలో రాష్ట్ర వైద్యవిజ్ఞాన సదస్సు
రాజంపేట: అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేతృత్వంలో రెండురోజుల పాటు రాష్ట్ర వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించనున్నట్లు ఇండియన్‌మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు ఎలక్ట్ డాక్టర్ బాలరాజు వెల్లడించారు.రాజంపేటలో మీడియాతో మాట్లాడారు. ఈనెల 22, 23న రాజంపేట–రాయచోటి రహదారిలోని తిరుమల కన్వన్షెన్ సెంటర్‌లో సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. తొలిరోజు ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డా.దిలీప్ బన్సులి, మాజీ జాతీయఅధ్యక్షుడు డా.వినయ్ అగర్వాల్, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డా.దగ్గుమాటి శ్రీహరిరావు, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నందకిషోర్ పాల్గొంటారన్నారు. వీరితోపాటు రాష్ట్ర ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గం పాల్గొంటుందన్నారు. ప్రధానంగా తొలిరోజు16 అంశాలు, రెండోరోజు 16 అంశాలపై చర్చించనున్నట్లు చెప్పారు. నేటి సమాజంలో విజృంభిస్తున్న వ్యాధులు, నివారణోపాయాలతోపాటు కొత్తరకమైన జబ్బులు తదితర అంశాల గురించి ఆయా రంగంలో నిష్ణాతులైన వైద్య నిపుణుల ప్రసంగాలు ఉంటాయన్నారు. తిరుపతి, కడప, కర్నూలు, నెల్లూరు, ఢిల్లీ,హైదరాబాద్‌కు చెందిన పలువురు ప్రముఖ వైద్యుల ప్రసంగాలు ఉంటాయని తెలిపారు. సమావేశంలో ఐఎంఏ నేతలు సుధాకర్, విజయకుమార్, చలమయ్య, వీరయ్య, సునీల్, శ్రీహరి, అనిల్, నవీన్, మధుసూదన్ పాల్గొన్నారు.


