కబ్జాదారులపై కేసు నమోదు చేయాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : స్థానిక రవీంద్ర నగర్‌లోని మురాదియా ముస్లిం శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా ను అడ్డుకున్న స్థానికుడు సయ్యద్ అబూ తల్హాపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ నగర కార్యదర్శి యన్. వెంకట శివ డిమాండ్ చేశారు. సయ్యద్ అబూ తల్హాను గురువారం సీపీఐ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పాలక సంస్థ, వక్ఫ్ బోర్డు పరిధిలో గల మురాదియా ముస్లిం కమ్యూనిటీ శ్మశాన వాటిక స్థలాన్ని క్రమేణా కబ్జా చేయడానికి అక్కడ ఉన్న పెద్ద చెట్లను నరికేసి అమ్మేసి దురాక్రమణకు తెగబడటం దారుణమన్నారు. దీనిపై కార్పొరేషన్, వక్ఫ్ బోర్డు అధికారులకు స్థానిక ప్రజలతో కలిసి వినతి పత్రాలు సమర్పించి, మీడియా సమావేశం నిర్వహించిన, శ్మశాన వాటిక స్థల పరిరక్షణలో క్రియాశీలకంగా ఉన్న స్థానికుడు సయ్యద్ అబూ తల్హాపై ఆక్రమణదారులు మారణాయుధాలతో దాడి చేయడం దుర్మార్గమన్నారు. దాడి జరిగిన వెంటనే ఫిర్యాదుదారుడి స్టేట్‌మెంట్ రికార్డు చేయడంలోనూ కేసు నమోదు చేయడం లోనూ, హత్యాయత్నం కేసు నమోదు చేయడంలోనూ, నిందితులపై కఠిన చర్యలు చేపట్టడంలోనూ అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల మేరకు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. మురాదియా శ్మశాన వాటిక స్థలాన్ని వెంటనే పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ నాయకుడు గౌస్ పాల్గొన్నారు.


