ఉల్లి ఉత్పాదకతపై కేంద్ర అధికారుల పరిశీలన
మైదుకూరు : ఉల్లి ఉత్పాదకతపై కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు గురువారం దువ్వూరు మండలంలో పర్యటించి పరిశీలించారు. మండలంలోని చిన్నసింగనపల్లెలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ డిప్యూటీ కమిషనర్ బ్రహ్మ, ఇతర అధికారులు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఉల్లి (పెద్ద బళ్లారి), కేపీ ఉల్లి (చిన్నబళ్లారి) హెక్టారుకు ఎంత దిగుబడి వస్తుందనే విషయాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ బ్రహ్మ మాట్లాడుతూ ఉల్లి ఉత్పాదకతను పెంచేందుకు పాటించాల్సిన పద్ధతులను వివరించారు. మైదుకూరులో కేపీ ఉల్లి శాశ్వత కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, విత్తనాలకు సబ్సిడీ ఇవ్వాలని, కేపీ ఉల్లి ఎగుమతి కోసం రాష్ట్రానికి లైసెన్స్ మంజూరు చేయాలని రైతులు కోరారు. దానిపై డిప్యూటీ కమిషనర్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు మనోజ్, రాజీవ్‌కుమార్, భార్గవ్, రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారి జమదగ్ని, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సతీష్, ఎన్‌హెచ్‌ఆర్‌డీఎఫ్ కర్నూలు అధికారి శరవణన్, మైదుకూరు ఉద్యాన అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.


