ప్రపంచంలో భారతదేశాన్ని
ఉరుసుకు ఆహ్వానం
మాట్లాడుతున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకటయ్యనాయుడు
కడప ఎడ్యుకేషన్: విద్యార్థులు తెలివితేటలకు సాన పెట్టి కొత్త సవాళ్లను అధిగమిస్తూ ప్రపంచంలో భారతదేశాన్ని మేటిగా నిలిపేలా.. క్రమశిక్షణ కలిగిన పౌరులుగా తయారు కావాలని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉద్భోదించారు. ప్రపంచంలో నాలుగో ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు యువత తమ మేధాశక్తికి సానపెట్టి కొత్త సవాళ్లను స్వీకరించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కడప జిల్లాలోని యోగివేమన విశ్వవిద్యాలయం నూతన పరిపాలనా భవనంలోని అన్నమయ్య సెనేట్ హాలులో వైవీయూ వీసీ బెల్లకొండ రాజశేఖర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుక సందర్భంగా విద్యార్థులతో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమెరికా స్నేహం అవసరం అనుకున్నా దేశ సార్వభౌమత్వాన్ని ఫణంగా పెట్టడానికి ప్రధాని మోదీ సిద్ధంగా లేరన్నారు. అమెరికా వైట్‌హౌస్ అధ్యక్షుడు మోదీని డిన్నర్‌కు ఆహ్వానించినా హాజరుకాలేదన్నారు. అయనే అంత క్రమశిక్షణతో ఉన్నప్పుడు నేటి యువత మరింత క్రమశిక్షణ అలవర్చుకోవాలని సూచించారు. చిన్న పిల్లలకు డైపర్లు మార్చినంత ఈజీగా రాజకీయ నాయకులు రోజుకోపార్టీ మారుతున్నారని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌లను మైకులు విరగగొట్టడం, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడానికి వేదికగా మార్చారన్నారు.ప్రస్తుతం బూతులు మాట్లాడటం జరుగుతోందని, అయితే ప్రజలు వారికి పొలింగ్ బూతులోనే సమాధానం చెప్పాలని పేర్కొన్నారు.
జీవిత సత్యాలను బోధించిన
మహనీయుడు యోగి వేమన
జీవిత సత్యాలను బోధించిన మహనీయుడు యోగివేమన అని, ఆయన శతకం చదివితే జీవితాన్ని చదివినట్లే అని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వైవీయూలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జానమద్ది హనుమచ్ఛాస్త్రి కార్యక్రమం కోసం కడపకు వచ్చానన్నారు. ఇందులో భాగంగా యోగివేమన విశ్వ విద్యాలయాన్ని సందర్శించానన్నారు.ఇన్నేళ్ల తన అనుభవంలో తెలుసుకున్న విషయాలను విద్యార్థులు, యువతతో పంచుకోవాలనే ఉద్దేశంతో దేశంలోని విశ్వ విద్యాలయాలు, ఐఐఎంలు, ఐఐటీలు సందర్శిస్తున్నట్లు చెప్పారు. కడపజిల్లాలో యోగివేమన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చరిత్రాత్మకంగా, సాంస్కతికంగా, ఆధ్యాత్మికంగా కడపజిల్లా తెలుగువారికి అత్యంత ఇష్టమెన ప్రదేశం అన్నారు. మత సామర్యానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. తాళ్లపాక అన్నమాచార్యులు, ఆయన శ్రీమతి తిమ్మక్కలు ఈ ప్రాంతాన్ని పునీతం చేశారన్నారు. తెలుగు కవయిత్రి మొల్ల గోపవరం అడపడుచు అన్నారు.శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో అల్లసాని పెద్దన, రామభద్రుడు కూడా కడపజిల్లాకు చెందిన వారే అని అన్నారు.సీపీబ్రౌన్ కడపజిల్లా జేిసీగా పనిచేస్తూ తెలుగుభాషపై మక్కువ పెంచుకుని, భాషాభివృద్ధికి కృషి చేశారన్నారు. కడపజిల్లా సాంస్కృతిక, కళా సాహిత్య, ఆధ్యాత్మి కతలకు నెలవని కొనియాడారు. భారత ఔన్నత్యం, ఆంధ్రప్రదేశ్ గొప్పదనం, తెలుగుభాష తీయదనం విద్యార్థులకు అర్థమయ్యేలా తెలిపారు. ప్రపంచంలోకెల్లా గొప్ప ప్రజాస్వామ్య దేశం భారతదేశం అని అన్నారు. ప్రపంచంలోని 12 మల్టీ నేషనల్ కంపెనీల్లో భారతీయులు సీఈవోలుగా ఉన్నారని వివరిస్తూ దేశం బలోపేతం కావాలంటే, యువత తమలో ఉన్న శక్తి సామర్థ్యాలను వినియోగించాలన్నారు. వైవీయూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు ప్రదర్శించిన చిత్రకళ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రం ఆకట్టుకునేలా ఉన్నాయని మెచ్చుకున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ పెద్దల మాటలను ప్రతిఒక్కరూ పాటించి సన్మార్గంలో నడవాలని సూచించారు. వైవీయూ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ పుత్తా పద్మ, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి శ్రీనివాస్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, కడప ఆర్డీవో జాన్ ఇర్విన్ తదితరులు పాల్గొన్నారు.
కడప సెవెన్‌రోడ్స్: కడప నగరంలోని అమీన్ పీర్ దర్గాలో ఈనెల 5వ తేదీ నుంచి జరిగే ఉరుసు ఉత్సవాలకు రావాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఆహ్వానించారు. శనివారం కడపకు వచ్చిన మాజీ ఉప రాష్ట్రపతిని దర్గా భక్తులు కలిశారు. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ దర్గా చరిత్రను తెలుసుకున్నానని తెలిపారు. మత సామరస్యానికి పెద్ద దర్గా ప్రతీకగా నిలుస్తోందన్నారు. అటు ఆధ్యాత్మిక, ఇటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంపై దర్గా భక్తులను ఆయన అభినందించారు.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ప్రపంచంలో భారతదేశాన్ని


