సారస్వతమూర్తి డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి
● నేడు శత జయంతి వేడుకలు
● ముఖ్య అతిథిగా మాజీ ఉప రాష్ట్రపతి
వెంకయ్యనాయుడు
కడప సెవెన్‌రోడ్స్ : తెలుగు సాహిత్య రంగంలో మరువలేని పేరు డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి. మరీ ముఖ్యంగా వైఎస్సార్ కడప జిల్లా సాహిత్య లోకంలో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అటు గ్రంథాలయాల అభివృద్ధి, ఇటు బ్రౌన్ గ్రంథాలయం ఏర్పాటుతో సాహిత్యాభివృద్ధికి ఎంతో కృషి చేసిన డాక్టర్ జానమద్ది శత జయంతి వేడుకలు ఆదివారం కడపలో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆ సారస్వతమూర్తి గురించి....
బ్రౌన్ గ్రంథాలయం ఏర్పాటులో..
తెలుగుభాష పరిరక్షకులుగా ఆంగ్లేయుడు సీపీ బ్రౌన్ అనంత కీర్తిని పొందారు. ఆయన సాహితీ కృషిని తెలుగు వారికి అందజేసిన ఘనత డాక్టర్ జానమద్దికే దక్కుతుంది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయనశాఖలో బ్రౌన్ పరిశోధన విభాగం 1974లో ఏర్పాటైంది. ఆచార్య జీఎన్ రెడ్డి పర్యవేక్షకులుగా, బంగోరే (బండి గోపాల్‌రెడ్డి) పరిశోధకులుగా పరిశోధన ప్రారంభించారు. బ్రౌన్ రచించిన రీడర్లు, సాహిత్య ఆత్మకథ ఆధారంగా వీరివురు కడపలో బ్రౌన్ నివసించిన బంగళా శిథిలాలను గుర్తించారు. అప్పుడు ఆ స్థలం ఆడిటర్ సీఆర్ కృష్ణస్వామి ఆధీనంలో ఉంది. 1976లో జానమద్ది జిల్లా రచయిత సంఘం మహాసభలను కడపలో నిర్వహించారు. ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత ఆరుద్ర, జీఎన్ రెడ్డి, బంగోరే ఆ సభల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా వారు కలెక్టర్ పీఎల్ సంజీవరెడ్డిని కలిసి బ్రౌన్ నివసించిన ప్రదేశంలో స్మారక గ్రంథాలయాన్ని నిర్మించాలని కోరారు. కలెక్టర్ వెంటనే స్పందించి జానమద్ది హనుమచ్ఛాస్త్రితో కలిసి స్థల యజమాని కృష్ణస్వామితో చర్చించారు. గ్రంథాలయ నిర్మాణానికి 20 సెంట్ల స్థలం ఉచితంగా ఇచ్చేందుకు కృష్ణస్వామిని అంగీకరింపజేయడంలో జానమద్ది కృషి ఎంతో ఉంది. అలా 1987 జనవరి 22న గ్రంథాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. బ్రౌన్ నివసించిన బంగళా మొండి గోడల నుంచి నేడు మహాసౌధంగా రూపుదిద్దుకుందంటే అందుకు జానమద్ది నిరంతర, అలుపెరగని కృషే కారణం. ఆయన లేకుంటే గ్రంథాలయమే లేదు. అందుకే డాక్టర్ సి.నారాయణరెడ్డి ఆయనకు బ్రౌన్ శాస్త్రి అని కితాబిచ్చారు.
కైఫియత్తులు తీసుకురావడంలో..
ప్రకాశం పంతులు శతజయంతి సభల్లో పాల్గొనేందుకు జానమద్ది మద్రాసు వెళ్లినప్పుడు కై ఫియత్తుల గురించి విన్నారు. రైల్వే టీటీఈగా పనిచేస్తున్న కడపకు చెందిన గాజులపల్లె వీరయ్య సాయంతో తమిళనాడు ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న జేటీ ఆచార్యులను కలిశారు. కడప కై ఫియత్తులు ఇప్పించాలంటూ నాలుగైదుసార్లు చైన్నెకి వెళ్లి ఆచార్యులను కలిశారు. ఎట్టకేలకు జేటీ ఆచార్యుల ప్రత్యేక శ్రద్ధ వల్ల 44 సంపుటాల కై ఫియత్తుల జిరాక్స్ ప్రతులు 1994 డిసెంబరులో బ్రౌన్ గ్రంథాలానికి చేరాయి. వీటిని జానమద్ది మానసపుత్రుడైన విద్వాన్ కట్టా నరసింహులు పరిష్కరించారు.
తెలుగుభాష.. సంస్కృతులపై పట్టు..
జాతీయ స్థాయిలో తెలుగు కవులు, రచయితలతో ఆత్మీయ అనుబంధం గల ఆయన తెలుగు, ఆంగ్ల, కన్నడల్లో పలు రచనలను అనువదించారు. స్వయంగా ఎన్నో పుస్తకాలు రచించారు. అటు ప్రాచీన సాహిత్యం, ఇటు అభ్యుదయ సాహిత్యాన్ని ఒకేలా ఆదరించారు. మాసీమ కవులు, బళ్లారి రాఘవ జీవిత చరిత్ర, సీపీ బ్రౌన్ చరిత్ర, కస్తూరి కన్నడ సాహిత్య సౌరభం, కడప సంస్కృతి–దర్శనీయ స్థలాలు, రసవద్ఘట్టాలు తదితర ఆయన రచించిన 16 గ్రంథాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అలాగే వివిధ దినపత్రికల్లో 2500కు పైగా వ్యాసాలు రాశారు. జిల్లా రచయితల సంఘం కార్యదర్శిగా గొప్ప కవులను జిల్లాకు ఆహ్వానించి సభలు ఏర్పాటు చేశారు. బ్రౌన్ గ్రంథాలయాన్ని జిల్లాలో సాహితీ సభలకు ముఖ్య కేంద్రంగా మార్చారు. సాహిత్యం పట్ల అభిమానం, అభిరుచి ఉన్న వారిని ఎంతో ఆదరించి ఆ రంగం వైపు ప్రోత్సహించారు. తెలుగుభాష సంస్కృతుల పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు ఏ సమాచారం కావాలన్నా ఆయననే సంప్రదించేవారు.
‘సీమ’వాసి కావడమే శాపం
మిణుకుమిణుకు మంటున్న తెలుగు భాషా సాహిత్యాల సముద్ధరణకు జీవితాంతం అవిరళ కృషి చేసిన సీపీ బ్రౌన్‌ను తెలుగు వారు దాదాపు మరిచిపోయిన సమయంలో జానమద్ది ఆయనను వెలుగులోకి తీసుకొచ్చారు. బ్రౌన్ గ్రంథాలయ ఏర్పాటుతో సహా తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన కృషి అమోఘం. ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి కనీసం పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందించలేదు. రాయలసీమ వాసి కావడమే ఆయన చేసుకున్న పాపమని పలువురు పేర్కొంటున్నారు. ఆయన భాషా సాహిత్యాలకు చేసిన విశేష సేవలను వివిధ సంస్థలు గుర్తించి పురస్కారాలతో గౌరవించాయి. 1998లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ అందజేసింది. గ్రంథాలయానికి ఆయన అందించిన సేవలకు గుర్తుగా 2014 అక్టోబరు 20న గ్రంథాలయ ఆవరణలో డాక్టర్ జానమద్ది శిలా విగ్రహాన్ని నాటి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ద్వారా ఆవిష్కరింపజేశారు.
జానమద్ది సాహితీపీఠం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం బ్రౌన్ గ్రంథాలయంలో శతజయంతి సభ నిర్వహిస్తున్నారు. జానమద్ది స్మారక సాహిత్య, గ్రంథాలయ సేవా పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. అలాగే రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విశిష్ట అతిథిగా, కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, ఏపీఎస్ పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి, యోగి వేమన విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్, స్టేట్ బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.హేమ ఆత్మీయ అతిథులుగా హాజరు కానున్నారు. అనంతరం రాష్ట్ర నాటక అకాడమి చైర్మన్ డాక్టర్ గుమ్మడి గోపాలకృష్ణ, పంచ సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్, ప్రసారభారతి విశ్రాంత అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ రేవూరు అనంత పద్మనాభరావు, కర్ణాటకలో 20 లక్షల పుస్తకాల గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్న మరె అంకేగౌడలకు ఈ సందర్భంగా పురస్కారాలను అందిస్తున్నారు.
నేడు శతజయంతి సభ


