
యూసీఐఎల్ అధికారుల తీరుపై ఆందోళన
పులివెందుల టౌన్ : తమ సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని పులివెందుల నియోజకవర్గ పరిధిలోని వేముల మండలం కె.కె.కొట్టాల గ్రామస్తులు యూసీఐఎల్ అధికారులపై మండిపడ్డారు. సోమవారం పులివెందులలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ చిన్నయ్య నేతృత్వంలో యూసీఐఎల్ అధికారులు జీఎం సుమన్ సర్కార్, డీజీఎం విజయకుమార్, భూసేకరణాధికారి నవీన్ కుమార్‌రెడ్డితో గ్రామస్తులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ టైలింగ్ పాండ్, ఇతర కారణాల వల్ల తమ గ్రామంలో ఆరోగ్య పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. సీఎస్‌ఆర్ నిధుల కింద ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, తమ గ్రామంలో అవసరమైన తాగునీరు, విద్య, వైద్య సౌకర్యాలు కూడా కల్పించలేదని ధ్వజమెత్తారు. తాజాగా టైలింగ్ పాండ్ నిర్మాణం ఎత్తు పెంచుకుంటూ పోతున్నారని, దానివల్ల తమ గ్రామస్తులకు జరిగే అన్యాయం, కష్టం, నష్టం గుర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి, పునరావాసం కింద తమకు తగిన వసతులు కల్పించి, గ్రామం మొత్తాన్ని యూసీఐఎల్ పరిధిలోకి తీసుకుని తమను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా యూసీఐఎల్ జీఎం సమాధానమిస్తూ గ్రామస్తుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరగా పరిష్కారమయ్యేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో చిన్నయ్య, డీజీఎం విజయకుమార్, భూసేకరణ అధికారి నవీన్ కుమార్ రెడ్డి, ఆలూరు రాజేష్ బాబు, సర్పంచ్ రంగనాథం, మోహన్ బాబు, రాజేష్, శివ పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలని కె.కె.కొట్టాల వాసుల డిమాండ్