
విద్యార్థుల సమస్యలను డీన్‌లకు విన్నవించాలి
వేంపల్లె : విద్యార్థులకు సమస్య ఎదురైనప్పుడు అకడమిక్ అసోసియేట్ డీన్, నాన్ అకడమిక్‌కు అయితే వార్డెన్, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్‌ను సంప్రదించాలని డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా, పరిపాలనాధికారి రవికుమార్ అన్నారు. ఆర్జీయూకేటీ పరిధిలోని ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో కొత్తగా చేరిన విద్యార్థులకు బుధవారం పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈ ఏడాది పీయూసీ–1లో సెమిస్టర్ విద్యా విధానానికి బదులుగా వార్షిక పరీక్షలు, మధ్యలో ఆరు మాసాంత(మిడ్) పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. విద్యార్థుల సంరక్షితార్థం ఓల్డ్ క్యాంపస్ మొత్తం పీయూసీ1–2 బాలికలకు కేటాయించామని, అక్కడే తరగతులు, వసతులు ఉండేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. బాలురకు ఏబీ–1లో తరగతులు, బీహెచ్–1లో వసతి కేటాయించారన్నారు. పోస్టాఫీస్, బ్యాంకింగ్, 24/7 అంబులెన్స్, హాస్పిటల్ డాక్టర్స్ గురించి వివరించారు. రెండో విడతలో ఎంపికై న విద్యార్థులకు ఈ నెల 17న సెంట్రల్ లైబ్రరీలో కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో డీన్ అకడమిక్స్ డాక్టర్ రమేష్ కై లాష్, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ వెంకటేష్ , ఆసోసియేట్ డీన్స్ రాఘవరెడ్డి, రఫి, పీఆర్‌ఓ తిరుపతిరెడ్డి, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శంషాద్ బేగం, ఓబయ్య, డాక్టర్ కార్తీక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.