
పోలీసుల విచారణకు వస్తూ.. అస్వస్థతకు గురై
బద్వేలు అర్బన్ : బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన నకిలీ పట్టాల కేసులో విచారణకు హాజరు అయ్యేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన నకిలీ ఇంటి పట్టాల కేసులో గత వారం రోజులుగా పోలీసులు పలువురినీ విచారిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని సుమిత్రా నగర్‌కు చెందిన డి.రవికుమార్‌ను రోజూ స్టేషన్‌కు పిలిచి రాత్రికి ఇంటికి పంపిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం కూడా విచారణ నిమిత్తం స్టేషన్ వద్దకు వచ్చిన రవికుమార్ తీవ్ర అస్వస్థతకు గురై కిందపడిపోయారు. పోలీసులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారమివ్వడంతో వారు వచ్చి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. పోలీసులు తమను ఏమీ ఇబ్బంది పెట్టలేదని, వారం రోజులుగా స్టేషన్‌కు పిలిపిస్తుండటంతో భయాందోళనకు గురై నిద్ర మాత్రలు మింగారని రవికుమార్ కుటుంబీకులు తెలిపారు.