
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తాం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : కేంద్రంలో ప్రధాన మోదీ అమలు చేస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రటిఘటిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సీఎస్‌ఐ చర్చి నుంచి ర్యాలీ ప్రారంభమై కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, సెవెన్ రోడ్స్, గోకుల్ సర్కిల్, ఒకటవ గాంధీ సర్కిల్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, మీదుగా సెవెన్ రోడ్స్ దగ్గరకు చేరింది. అక్కడ నిర్వహించిన సభలో వారు మాట్లాడుతూ బీజేపీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లు తీసుకొస్తోందన్నారు. లేబర్ కోడ్‌లు అమలుచేస్తే కనీసం కార్మికులు తమ సమస్యలపై నిరసన తెలియజేసే అవకాశం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటీష్ కాలంలో కార్మికులు పోరాడి సాధించుకున్న పని గంటలను సైతం పెంచుతున్నారని, కార్మిక సంఘాల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. 73 షెడ్యూల్‌లోని మునిసిపల్, అంగన్వాడీ, ఆశా, తదితర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అందక, ఉద్యోగభద్రత లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వారి సమస్యలపై ఇకపై నిరసన తెలుపుకొనే అవకాశం కోల్పోతారని, ఇది నిర్బంధ నిరంకుశ విధానాలకు తార్కాణమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఆటో, హమాలీ, వీధి విక్రయ కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పచెబుతూ ఆదానీ, అంబానీలకు పన్నులు తగ్గిస్తూ కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగసుబ్బారెడ్డి, బి.మనోహర్, కే.శ్రీనివాసులురెడ్డి, బండి రామలింగారెడ్డి. ఉద్దె మద్దిలేటి, సుబ్బరాయుడు, జయవర్ధన్, ఓబయ్య, ఐఎఫ్‌టీయూ నాయకులు రాము, రమణయ్య, యూటీఎఫ్ నాయకులు లక్ష్మిరాజా ఎన్.వెంకటశివ, రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్త సమ్మె సభలో వామపక్ష నాయకులు