
గంజాయి కేసులో భార్యాభర్తల అరెస్టు
కడప అర్బన్ : కడప నగరం డీటీసీ సర్కిల్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద గంజాయి విక్రయిస్తున్న భార్యాభర్తలను అరెస్టు చేసినట్లు రిమ్స్ పోలీసు స్టేషన్ సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. రిమ్స్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వల్లూరు మండలం తోళ్లగంగన్నపల్లి గ్రామానికి చెందిన చెన్నుబోయిన రాము గతంలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. ఆ సమయంలో కాకినాడ టౌన్ తుమ్మలపేటకు చెందిన వాసుపిల్లి భారతి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. ప్రస్తుతం వారిద్దరు కడప శాస్త్రి నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఎలాంటి పనులకు వెళ్లకుండా గంజాయి వ్యాపారం చేసి తక్కువ సమయంలో డబ్బులు బాగా సంపాదించాలని రాము ఆలోచించాడు. తనకు పరిచయమున్న మహేష్ అనే వ్యక్తి నుండి గంజాయి తెచ్చుకొని విక్రయిస్తున్నట్లు తెలిపారు. సోమవారం డీటీసీ సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద తనిఖీలు చేస్తున్న సమయంలో దంపతులు బైక్‌పై గంజాయి పెట్టుకొని వస్తుండగా వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. భార్యాభర్తల నుండి 2.8 కేజీల గంజాయిని మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. రాము అనే నిందితుడిపై గతంలో చైన్ స్నాచింగ్ కేసులు కూడా నమోదయ్యాయి.
2.8 కేజీల గంజాయితో పాటు
మోటార్ సైకిల్ స్వాధీనం