
వ్యక్తి అదృశ్యం
కడప అర్బన్ : కడప నగరం చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న వనిపెంట అంజాద్‌ఖాన్ గత నెల 28వ తేదీన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని అతని భార్య సల్మా ఈనెల 5వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడప నగర శివార్లలోని తెలుగుగంగ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఇరిగేషన్ విభాగంలో పనిచేస్తున్న అంజాద్‌ఖాన్ ఇటీవలే బదిలీపై బద్వేల్‌కు వెళ్లారు. అంజాద్‌ఖాన్ తన కుటుంబ అవసరాల కోసం, అనారోగ్య విషయమై అప్పులు ఎక్కువగా చేశారని అతని భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నెల 28న ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదని ఆమె తెలిపారు. అతని ఆచూకీ తెలిసిన వారు కడప చిన్నచౌక్ సీఐ సెల్: 9121100520, ఎస్‌ఐలు 9121100521, 9121100522కుగానీ సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
బహుజన టీచర్స్
యూనియన్ ఆవిర్భావం
కడప రూరల్ : బహుజన టీచర్స్ యూనియన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ నూతన సంఘం ఆవిర్భావ సమావేశం ఆదివారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షునిగా మేకల శివార్జున, ప్రధాన కార్యదర్శిగా సి.సుదర్శన్ బాబు, కోశాధికారిగా ఏ.రాజబాబు ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎం.గంగరాజు, కె.గంగాధర్, ఎం.శ్రీదేవి, ప్రేమ సాగర్ నిత్య ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడిగా గంగరాజు, కార్యదర్శిగా బేరి మోహన్, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా కట్టా గంగాధర్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
యాంటీ రేబీస్ టీకాలు వేయించాలి
కడప అగ్రికల్చర్ : జంతు ప్రేమికులు తమ పెంపుడు శునకాలకు తప్పనిసరిగా యాంటీ రేబీస్ టీకాలు వేయించి జంతు సంక్రమిత వ్యాధులను నివారించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఆదివారం కడప పశుసంవర్థక శాఖ పాలీ క్లినిక్ కార్యాలయంలో ఉచిత రాబిస్ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు జూనొసిస్ (జంతు సంక్రమిత) వ్యాధులు సంక్రమిస్తాయన్నారు. జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ శారదమ్మ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 17వేల డోసులు అందుబాటులో ఉన్నాయని పెంపుడు జంతువుల ప్రేమికులందరూ వ్యాక్సినేషన్ వేయించాలని సూచించారు. అనంతరం ఈ నెల 7 నుంచి 14 వరకు నిర్వహించే పశుగ్రాస వారోత్సవాల పోస్టర్లను పశుసంవర్థక శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ డీడీ రంగస్వామి, ఇన్‌చార్జి డీడీ శ్రీనివాసరెడ్డి, ఏడీ డాక్టర్ సుబ్బరాయుడు, ఏడీ డాక్టర్ నేతాజీ, ఏడీ డాక్టర్ మాధవి, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ చాంద్ బాషా, పశుసంవర్థక శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తి అదృశ్యం

వ్యక్తి అదృశ్యం