
కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోవాలి
కడప సెవెన్‌రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
సభాభవన్‌లో పీజీఆర్‌ఎస్ నిర్వహణ
ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)ను సోమవారం సభాభవన్‌లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమ వారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రజలు 08562– 244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఆర్వో సూచించారు.
నేటి నుంచి మంత్రి పర్యటన
కడప సెవెన్‌రోడ్స్: జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎస్.సవిత రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి సవిత సోమవారం ఉదయం పులివెందులలో స్థానిక ప్రజాప్రతినిధులతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అనంతరం లింగాలలో జరిగే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం కలెక్టరేట్‌లో జరిగే విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం కడప నగరంలో జరిగే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి కడప ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ బస చేయనున్నారు. 8వ తేది ఉదయం కమలాపురం నియోజకవర్గం చెన్నూరు మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కలెక్టరేట్‌లో జరిగే జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. సాయంత్రం మంత్రి రోడ్డు మార్గాన గుంటూరుకు బయలుదేరుతారని పేర్కొన్నారు.
హంసవాహనంపై సౌమ్యనాథుడు
నందలూరు: ఉమ్మడి కడప జిల్లాలో ప్రసిద్ధి చెందిన నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. ఇందులో భాగంగా మూడోరోజు ఆదివారం ఉదయం పల్లకీసేవ జరిగింది. సౌమ్యనాథుడు మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమాన్ని అర్చకులు సునీల్‌కుమార్, పండితులు రఘునందన్, పవన్‌కుమార్, మనోజ్‌కుమార్, సాయిస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. రాత్రి హంసవాహనంపై సరస్వతీదేవి అలంకారంలో స్వామివారు దేవేరులతో కలిసి మాడవీధుల్లో విహరించారు. భక్తులు స్వామివారికి కాయ కర్పూరం సమర్పించారు.