
నేడు వైఎస్ జగన్ రాక
పులివెందుల: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేటి నుంచి రెండు రోజులు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం 5గంటలకు ఆయన హెలీకాప్టర్ ద్వారా పులివెందులలోని భాకరాపురంలో ఉన్న హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి పులివెందులలోనే బస చేయనున్నారు. మంగళవారం ఉదయం దివంగత వైఎస్సార్ జయంతి సందర్భంగా పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ ఉదయం 7.30గంటల నుంచి 8.15గంటల వరకు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం పులివెందులకు చేరుకుంటారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటలకు పులివెందుల క్యాంప్ ఆఫీస్‌లో ప్రజలతో మమేకం అవుతారు. మంగళవారం సాయంత్రం పులివెందుల భాకరాపురం హెలీప్యాడ్ నుంచి బెంగుళూరుకు బయలుదేరి వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
నియామకం
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ, లా కళాశాలల పరిశీలన, పర్యవేక్షణకు కమిటీని నియమిస్తున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పుత్తా పద్మ తెలిపారు. కళాశాలల యాజమాన్యాలు తరగతులు నిర్వహించకున్నా పరీక్షలు నిర్వహిస్తోందని విద్యార్థి, ప్రజాసంఘాల నుంచి వినతులు రావడంతో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచా ర్య అల్లం శ్రీనివాస రావు మార్గదర్శకం మేరకు సీనియర్ ప్రొఫెసర్లతో కమిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కమిటీ కళాశాలలను సందర్శించి వాస్తవ స్థితిగతులు తెలియజేస్తుందన్నారు. ఆ మేరకు నివేదిక ఆధారంగా కళాశాలలపై తదు పరి చర్యలు ఉంటాయని ఆమె వివరించారు.
సోమవారం సాయంత్రం పులివెందులకు చేరుకోనున్న మాజీ సీఎం