
ఏ.ఆర్ కానిస్టేబుల్ సస్పెన్షన్
కడప అర్బన్: కడప పోలీసు కళాజాగృతి బృందం సభ్యులలో మహిళా డ్యాన్సర్‌పై అసభ్యంగా ప్రవర్తించిన ఏ.ఆర్ కానిస్టేబుల్ ఉత్తమ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తనపై అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఎస్పీ ప్రాథమిక విచారణ చేయించారు. విచారణలో కానిస్టేబుల్ ఉత్తమ్ కుమార్ తప్పు చేశాడనీ రుజువు కావడంతో అతనిపై వేటు వేశారు.
నియామక పత్రాలు అందజేత
కడప కోటిరెడ్డిసర్కిల్: రైల్వే ఇన్‌స్టిట్యూట్ భవన్ ఎన్నికలు వారం రోజుల కిందట ఏకగ్రీవంగా ముగిశాయి. ఇందుకు సంబంధించిన నియామక పత్రాలను బుధవారం రైల్వే పోలింగ్ ఆఫీసర్ రాధాకృష్ణయ్య, వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్ గంగాదేవి ఎన్నికై న వారికి అందజేశారు. ఈ సందర్భంగా రైల్వే ఇన్‌స్టిట్యూట్ సెక్రటరీగా రవికుమార్, సంయుక్త కార్యదర్శిగా నరేష్‌కుమార్, కోశాధికారిగా వెంకటేశ్వరరెడ్డి, ఆపరేటింగ్ కమిటీ సభ్యులుగా లక్ష్మినారాయణ, చినబాబు, ఎలక్ట్రికల్ కమర్షియల్ ఇంజనీరింగ్ ఎస్‌అండ్‌టీ కమిటీ సభ్యులుగా రాజేష్‌కుమార్, గీత, అనిల్‌కుమార్, మస్తాన్‌లకు నియామక పత్రాలను అందజేశారు.
సహకార సంఘాలు
అభివృద్ధికి సహకరించాలి
కడప అగ్రికల్చర్: జిల్లాలో సహకార సంఘాల భవిష్యత్తు ప్రణాళికలను రచించి ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి సిబ్బంది సహకరించాలని జిల్లా సహకార శాఖాధికారి యం. వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా బుధవారం కడప డివిజనల్ కో–ఆపరేటివ్ ఆఫీస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సహకార సంఘాలు సక్రమంగా పనిచేయడానికి కృషి చేయాలన్నారు. ప్రొద్దుటూరు సీటీసీ ప్రిన్సిపాల్ జి. శ్రీనివాస రావు మాట్లాడారు. అనంతరం సహకార శిక్షణా కేంద్రం ప్రొద్దుటూరులో 10వ బ్యాచ్ డీసీఎం, సీఏ విద్యార్థుల సర్టిఫికెట్లు తనిఖీ చేసి వారిని కోర్సులో నమోదు చేసుకున్నారు.. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్స్ పుష్పలత, కృష్ణరెడ్డి, నాగరత్నం, సత్యనందం, వెంకట రమణ, శ్రీధర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
విజన్ ప్లాన్ అమలుపై దృష్టి
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో అభివృద్ధి విజన్ ప్లాన్ అమలుపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని బోర్డు రూమ్‌లో స్వర్ణ ఆంధ్ర విజన్– 2047 లో భాగంగా జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్, నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ పై జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలసి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి నియోజకవర్గ స్పెషల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ లు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ వర్చువల్ విధానంలో సమీక్షించారు. జిల్లా, నియోజకవర్గ, మండలాల అభివృద్ధి విజన్ ప్లాన్‌పై ప్రతి ఒక్క నియోజకవర్గ స్పెషల్ అధికారులు,మండల అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాజంలో విజయవంతమైన వారు ఇతరులకు సహకారాన్ని అందించడం,నాలెడ్జ్ షేరింగ్ లాంటి అంశాలు పీ4 పాలసీలో ఇమిడి ఉన్నాయన్నారు. అలాగే ప్రతి గ్రామం, మండలాలలో మార్గదర్శులను గుర్తించే చర్యలను వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు 76 వేలకు పైగా బంగారు కుటుంబాలను గుర్తించామని తెలిపారు. అన్ని మండలాలలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించాలని ఆదేశించారు.
బీఈడీ పరీక్షలు ప్రారంభం
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధ బీఈడీ కళాశాలల రెండో సెమిస్టర్ పరీక్షలు బుధవారం జిల్లావ్యాప్తంగా 16 కేంద్రాలలో ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె. ఎస్ వి కృష్ణారావుతో కలిసి తనిఖీ చేశారు. కడపలోని శ్రీహరి డిగ్రీ కళాశాల, నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాల్ టికెట్లను, వసతులను పరిశీలించారు. 4,551 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు వారు తెలిపారు. విశ్వవిద్యాలయం నుంచి ప్రతి కేంద్రానికి అబ్జర్వర్లను పంపామని, ప్రత్యేకంగా హై పవర్ కమిటీ పరీక్షలను పర్యవేక్షిస్తుందని తెలిపారు.

ఏ.ఆర్ కానిస్టేబుల్ సస్పెన్షన్