
ముందుంది శ్రావణం.. ఏదీ స్వామి దర్శనం.!
చక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామి ఆలయం అంటే రాయలసీమ జిల్లాల్లో తెలియని వారంటూ ఉండరు. మరీ ముఖ్యంగా శ్రావణ మాసం అంటే గుర్తుకు వచ్చేది కూడా గండిక్షేత్రమే. లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకోవడానికి తరలి వస్తారు. అయితే గండి వీరాంజనేయుడి మూలవిరాట్ దర్శనం కోసం గత నాలుగేళ్ల నుంచి ఎదురు చూసిన భక్త జనానికి ఈ ఏడాది కూడా నిరాశేశే ఎదురవుతోంది. ఇందుకు కారణాలు చూస్తే కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆలయం పట్ల కొందరి నిర్లక్ష్యం. మరి కొందరి పంతాలు పట్టింపులు. ఇంకొందరి అసమర్థత ఇందులో బలంగా కనిపిస్తున్నాయి.
గండి వీరాంజనేయ స్వామి దేవస్థానాన్ని 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక టీటీడీలో విలీనం చేసి కొంత వరకు అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ఆయన తనయుడు జగన్ మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక ఏకంగా రు.28 కోట్లు నిధులు మంజూరు చేసి చరిత్రను తిరగరాశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలి శిలాఫలకం వేశారు. వెంటనే పనులు ప్రారంభించి త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే తొలుత పనులు వేగవంతంగా జరిగినా క్రమేపీ మంద కొడిగా సాగాయి. నేతలు, అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పుణ్య కాలం కాస్తా పూర్తయింది. ఆలయం పనులు పూర్తవలేదు. ఇంతలో ఎన్నికలు వచ్చాయి.తిరిగి ప్రభుత్వం అదికారం లోకి రాలేదు. ఆలయం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండి పోయాయి.
కూటమి ప్రభుత్వం వచ్చాక..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయం పనులు జోరందుకుంటాయని భక్తులు భావించారు. కాని ఇందుకు విరుద్ధంగా గత ప్రభుత్వంలోని పాలక మండలిని రద్దు చేయించి, తాము సీట్లో కూర్చోవాలి తర్వాతనే గుడి పునః ప్రతిష్ట పనులు అనే ధోరణితో కూటమి నేతలు ఉన్నట్లు తెలుసుకొని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహా కుంభాభిషేకం జరగాలంటే సుమారు రూ. 5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఖర్చు వస్తుంది. పెండింగ్ పనులు పూర్తి కావాలంటే మరో ఏడాది కాలం పడుతుంది. అంతవరకు కుంభాభిషేకం చేయకూడదని కొందరు చెబుతున్నారు. ఆ నిధులు ప్రభు త్వం నుంచి మంజూరు చేయించాలనే ఆలోచన ఏ ఒక్క కూటమి నేత చేయకపోవడం విచారకరం.
పునః ప్రతిష్ట చేస్తే సరిపోతుంది కదా..
ఆలయం పనులు పూర్తయ్యాకే మహా కుంభాభిషేకం అంటున్నారు. ఇందుకు పనులు పూర్తి కాలేదు అంటున్నారు. అయితే నిత్యం ధూప దీప నైవేద్యాలు మూల విరాట్‌కు అర్చకులు క్రమం తప్పక నిర్వహిస్తున్నారు. ఇన్ని చేసేవారు భక్తులకు స్వామి దర్శనం కూడా చేయించవచ్చు కదా అని చర్చించుకుంటున్నారు. పునః ప్రతిష్ట చేసేందుకు చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవి మహా అంటే వారం పది రోజుల్లో పూర్తవుతాయి. పైగా నిధుల ఖర్చు కూడా తగ్గుతుంది. భక్తులకు మూల విరాట్ దర్శనం చేయించిన వారు అవుతారు. దీనివల్ల ఆలయ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈ కోణంలో అధికారులు ఎందుకు ఆలోచించడం లేదనే ప్రశ్న భక్తుల నుంచి వినిపిస్తోంది.
పంతాలు పట్టింపులతో సరి..
ఆలయంలో 95 శాతం పైగా పనులు పూర్తయ్యా యని జూన్ నెలాఖరులోపు గుడి పునఃప్రతిష్ట కార్యక్రమం పూర్తి చేసేదుకు ముహూర్తపు తేదీని ఖరారు చేయాలని నాలుగు నెలల క్రితం దేవదాయశాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ కర్నూలు డీసీ పట్టెం గురుప్రసాద్‌లు ఆలయ ప్రధాన, ఉప ప్రధాన అర్చకులకు ఆదేశించారు. అయితే అర్చకుల మధ్య విభేదాలు తారా స్థాయిలో ఉన్నాయి. దీంతో ముహూర్తం నిర్ణయించేందుకు వీరు పట్టించుకున్న పాపాన పోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గండి ఆలయ పునః ప్రతిష్టపై వీడని ఉత్కంఠ
నాలుగేళ్లుగా నిరాశలో లక్షలాది మంది భక్తులు
ఈ ఏడాదీ అదే పరిస్థితి

ముందుంది శ్రావణం.. ఏదీ స్వామి దర్శనం.!