
గురుకుల హాస్టల్ టెండర్లలో ఉద్రిక్తత
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలోని గురుకుల పాఠశాల హాస్టళ్లకు సరుకులు సరఫరా చేసే టెండర్ల దాఖలు విషయంలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కడప, వేంపల్లె, మైలవరం గురుకులాల హాస్టళ్లకు కోడిగుడ్లు, చికెన్, పాలు, కూరగాయలు, అరటిపండ్లు తదితర సరుకులు సరఫరా చేసేందుకు టెండర్లు ఆహ్వానించారు. జాయింట్ కలెక్టర్ చాంబర్ వద్ద టెండరు బాక్సును ఏర్పాటు చేశారు. టెండర్ల దాఖలుకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు తుది గడువు విధించారు. దీంతో అధికార పార్టీకి చెందిన మండల, గ్రామ స్థాయి నాయకులు టెండరు దాఖలు చేసేందుకు వచ్చారు. మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం వనిపెంటకు చెందిన కొందరు కడపకు సంబంధించి టెండరు దాఖలు చేసేందుకు వచ్చారు. దీనికి కమలాపురం ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నాయకులు అడ్డు తగిలారు. తాము మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించిన టెండర్లు దాఖలు చేయలేదు గనుక మీరు కూడా కడపకు సంబంధించి టెండరు వేయవద్దంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరెవరి నియోజకవర్గాల పరిధిలో వారు టెండర్లు దాఖలు చేసుకోవాలంటూ సూచించారు. ఈ సందర్భంగా పరస్పరం తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. దాఖలైన టెండర్లను బుధవారం పరిశీలించనున్నారు.
కలెక్టరేట్‌లోనే బాహాబాహీకి యత్నం
పోలీసు బందోబస్తు ఏర్పాటు