ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌కు తీవ్రగాయాలు | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌కు తీవ్రగాయాలు

Published Mon, May 20 2024 10:30 AM

ఇంజిన

ములకలచెరువు : ఆటో ఢీ కొనడంతో ద్విచక్రవాహనదారుడికి తీవ్రగాయాలైన సంఘటన శనివారం రాత్రి మండలంలో చోటుచేసుకుంది. పొలీసుల కథనం మేరకు.. పీటీయం మండలం కాట్నగల్లు సచివాలయంలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రకాష్‌(38) ములకలచెరువుకు వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో స్థానిక రైల్వే గేటు వద్ద ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రకాష్‌ను కుటుంబసభ్యులు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

టిప్పర్‌ ఢీకొని ముగ్గురికి..

మదనపల్లె : వివాహ శుభ లేఖలు పంచేందుకు ద్విచక్రవాహనంలో వెళ్తున్న వారిని టిప్పర్‌ ఢీకొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. మండలంలోని బురకాయలకోటకు చెందిన సాహెబ్‌ పీర్‌(32), బంధువు కలికిరికి చెందిన హఫీజుల్లా(45) కలిసి వారి బంధువు వివాహ శుభలేఖలు పంచేందుకు ద్విచక్రవాహనంలో కలికిరి నుంచి మదనపల్లె మీదుగా పుంగనూరుకు వెళ్తున్నారు. మరో ద్విచక్ర వాహనంలో ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో ట్రాక్టర్‌ మెకానిక్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌(58) వీరికి సమీపంలో వెళ్తున్నారు. వలసపల్లె పంచాయతీ పరిధిలోని నయారా పెట్రోల్‌ బంక్‌ వద్ద వేగంగా వచ్చిన టిప్పర్‌ ఈ రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొంది. ప్రమాదంలో సాహెబ్‌పీర్‌, హఫీజుల్లా, రాజశేఖర్‌లకు గాయాలయ్యాయి. స్థానికులు ఆటోల్లో క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రాజశేఖర్‌ తిరుపతికి వెళ్లగా, సాహెబ్‌పీర్‌, హఫీజ్‌ఖాన్‌ వేలూరు సీఎంసీకి వెళ్లారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కారు డీకొని మరొకరికి..

కలకడ : కారు డీకొన్న ప్రమాదంలో వ్యక్తికి గాయాలైన సంఘటన చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. కలకడ ఎస్‌ఐ రామక్రిష్ణారెడ్డి వివరాల మేరకు.. కలకడ మండలం గంగిరెడ్డిగారిపల్లె హరిజనవాడ గ్రామానికి చెందిన మండెం చలపతి తన ద్విచక్ర వాహనంలో కలకడకు వచ్చి తిరిగి వెళ్తున్నారు. కలకడ హెచ్‌పీ పెట్రోల్‌ బంకు వద్ద రాయచోటి వైపు నుంచి పీలేరు వైపు వెళ్తున్న కారు ఢీకొంది. ప్రమాదంలో చలపతికి గాయాలయ్యాయి. 108 వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

విద్యుత్తు షాక్‌తో కేబుల్‌ నిర్వాహకుడు మృతి

బి.కొత్తకోట : డిష్‌ కేబుల్‌ వైర్‌ సరిచేస్తుండగా విద్యుత్తు షాక్‌ తగలడంతో డిష్‌ నిర్వాహకుడు మృతిచెందిన సంఘటన ఆదివారం ఉదయం బి.కొత్తకోట మండలం ఓబిరెడ్డిగారిపల్లెలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పెద్దతిప్పసముద్రం మండలం కాయలవాండ్లపల్లెకు చెందిన జి.రామకృష్ణారెడ్డి(40) స్వగ్రామంలో ఆర్‌కే సిటీ నెట్‌వర్క్‌ పేరుతో కేబుల్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఓబిరెడ్డిగారిపల్లెలో కేబుల్‌ తీగ గాలికి ఒరిగిందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో రామకృష్ణారెడ్డి శివాలయం వద్ద స్తంభంపైకి ఎక్కి కేబుల్‌ వైర్‌ను సరిచేస్తున్నాడు. ఆ సమయంలో రామకృష్ణారెడ్డి ఎడమ చేతి బోటన వ్రేలు విద్యుత్‌ తీగకు తగిలి షాక్‌కు గురయ్యాడు. స్థానికులు శ్రీనివాసులురెడ్డి, వినోద్‌కుమార్‌రెడ్డి స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన ధ్రువీకరించారు. మృతుడి భార్య రోషణ అలియాస్‌ పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్టు హెడ్‌కానిస్టేబుల్‌ నాగరాజుగౌడ్‌ తెలిపారు. మృతదేహాన్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌కు తీవ్రగాయాలు
1/1

ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌కు తీవ్రగాయాలు

Advertisement
 
Advertisement
 
Advertisement