సహజ వనరులకు ప్రాధాన్యత | Sakshi
Sakshi News home page

సహజ వనరులకు ప్రాధాన్యత

Published Sat, Dec 9 2023 4:54 AM

- - Sakshi

కడప సిటీ: మానవ మనుగడకు సహజ వనరులు అవసరం. భూమి, నీరు, వృక్ష సంపద తదితర ప్రాణాధార సహజ వనరులు మానవుని ఆవాసానికి ప్రధానమైనవి. పునరావృతం కాని వీటిని రక్షించుకుని సక్రమమైన మార్గంలో యాజమాన్యం చేయడం వల్ల జీవన ప్రమాణాలు ఆధారపడి ఉంటాయి. అందులో భాగంగానే వాటర్‌ షెడ్‌ పథకంలో ప్రభుత్వం ‘సహజ వనరుల యాజమాన్యం’(న్యాచురల్‌ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌) విధానాన్ని తీసుకొచ్చింది. ఈ పద్ధతిలో ఆయా గ్రామాల్లో సహజ వనరులను అభివృద్ధి చేసి గ్రామ పంచాయతీకి ఆస్తిగా అందజేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో వాటర్‌షెడ్‌ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ఆహారం, నీరు, పశువుల మేత తదితర నిత్యావసరాలు నానాటికి పెరుగుతున్నాయి. భూమి ఆధారిత వనరులను అమితంగా వినియోగించడం వల్ల ప్రకృతి సమతుల్యత యంత్రాంగానికి భంగం కలుగుతోంది. అందువల్ల భూసార సంరక్షణ, అడువుల పెంపకం, నీటి నిల్వ పనులు, నేలకోత నివారణ పనులు, పశు పోషణ, పండ్ల తోటల పెంపకం, రైతు అవసరాలు తీర్చే పనులను సహజ వనరుల యాజమాన్య కార్యక్రమం కింద ప్రజల భాగస్వామ్యంతో ఎంపిక చేసిన వాటర్‌షెడ్‌ ప్రాంత గ్రామాల్లో నిర్వహిస్తున్నారు.

● వాటర్‌షెడ్‌–పీఎంకేఎస్‌వై 2.0లో భాగంగా సహజ వనరుల యాజమాన్యం కింద వివిధ పనులు చేపడుతున్నారు. జిల్లాలో వాటర్‌షెడ్‌లో చేపట్టిన పనులకు బడ్జెట్‌లో 47 శాతం నిధులు కేటాయించారు. ఈ నిధులతో నేలకోత నివారణ, నీటి నిల్వ పనులు, భూసార సంరక్షణ, అటవీకరణ పనులు చేస్తారు.

రైతులకు ఉపయోగకరం

సహజ వనరుల నీటి యాజమాన్యం పథకం ద్వారా చేపడుతున్న పనులు సత్ఫలితాలు ఇస్తున్నాయి.వీటిని అభివృద్ది చేయడం వల్ల రైతాంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. జిల్లాలో కురిసిన వర్షం కారణంగా చెరువులు, కుంటలు నీటితో నిండాయి. భూగర్భజలాలు పెరగడంతో చెక్‌డ్యాములు, ఊటకుంటలు, పారంపాండ్స్‌లో ఉన్న నీటిని ఉపయోగించుకుని రైతులు వ్యవసాయం చేసేందుకు అనుకూలతగా మారింది.

పకడ్బందీగా

సహజ వనరుల నీటి యాజమాన్యం పనుల్లో ఎక్కడా అవినీతి, అక్రమాలు జరగకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా జియో ట్యాగింగ్‌ చేయడం జరుగుతుంది. సామాజిక తనిఖీ విభాగం చేత ఆడిట్‌ కూడా చేసి చూపిస్తారు. వాటర్‌షెడ్‌ కాల పరిమితి పూర్తయిన తర్వాత ఆ పనులన్నింటినీ గ్రామ ఆస్తిగా పరిగణించి వాటి సంరక్షణ, నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయతీకి అప్పజెబుతారు.

వాటర్‌షెడ్‌లో చకచకా పనులు

బడ్జెట్‌లో 47 శాతం నిధులు

పనులు పూర్తి చేసి గ్రామ పంచాయతీలకు అప్పగింత

ఇప్పటివరకు రూ.10.96 కోట్లతో 537 పనులు

పనులిలా...

ఈ పథకం కింద వైఎస్సార్‌ జిల్లాలో పనులు చేసేందుకు రూ. 40.95 కోట్లు బడ్జెట్‌ కేటాయించారు. ఇందులో ఇప్పటికే రూ.12.19 కోట్లు ఖర్చు చేసి 632 పనులను చేశారు. ఇందులో నేలకోత నివారణ పనులు అంటే కొండపై ట్రెంచులు, రాతి కట్టడాలు, గాబియన్స్‌ పనులను రూ. 1.20 కోట్లతో 94 చేయడం జరిగింది. అలాగే నీటి నిల్వ, భూసార సంరక్షణ పనుల కింద డగౌట్‌ పాండ్స్‌, ఊటకుంటలు, చెక్‌డ్యాములు, చెక్‌వాల్స్‌, అమృత్‌ సరోవర్స్‌, రైతు పొలాల్లో పారంపాండ్స్‌ పనులను రూ. 10.96 కోట్లతో 537 చేశారు. అటవీకరణ, పండ్ల తోటల పెంపకం పనులకు అనుమతులు రావాల్సి ఉంది.

ముమ్మరంగా పనులు

ప్రస్తుత తరుణంలో ప్రకృతిలో సహజ వనరులు దెబ్బతింటున్నాయి. వాటిని పునరుద్ధరించేందుకు సహజ వనరుల నీటి యాజమాన్యం పథకం ఎంతో ఉపయోగపడుతోంది. జిల్లాలో ఈ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మిగిలినవి కూడా త్వరలో చేపట్టి రైతాంగానికి మేలు చేసేలా చర్యలు చేపడతాం. – పి.యదుభూషణరెడ్డి, పీడీ, డ్వామా, కడప

1/3

2/3

3/3

Advertisement
 

తప్పక చదవండి

Advertisement