విలేకరిపై కేసు నమోదు | Sakshi
Sakshi News home page

విలేకరిపై కేసు నమోదు

Published Sat, Nov 18 2023 1:46 AM

-

కలసపాడు : మండలంలోని రాజుపాలెం గ్రామానికి చెందిన విలేకరి పసుపుల నాగేశ్వర్‌రావుపై కేసు నమోదైనట్లు ఎస్‌ఐ నాగమురళి తెలిపారు. ఈ నెల 12న దీపావళి సందర్భంగా కలసపాడుకు చెందిన అక్కిసునీత కలసపాడు శివారు ప్రాంతంలో టపాసుల లైసెన్స్‌ దుకాణం ఏర్పాటు చేసుకుని టపాసులు విక్రయిస్తోందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఓ సంస్థ(సాక్షి కాదు) విలేకరి నాగేశ్వర్‌రావు దుకాణం వద్దకు వెళ్లి ఉచితంగా టపాసులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారని పేర్కొన్నారు. తనకు టపాసులు ఊరికే రాలేదని, ఉచితంగా ఇవ్వబోమని ఆమె తెలిపిందన్నారు. నీ లైసెన్స్‌ను రద్దు చేయిస్తానని బెదిరించి పరుష పదజాలంతో ఆమెను మాట్లాడాడని చెప్పారు. ఈ మేరకు ఈ నెల 13వ తేదీన ఎస్పీకి స్పందనలో సునీత ఫిర్యాదు చేసిందన్నారు. పరిశీలించి శుక్రవారం నాగేశ్వర్‌రావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

కమలాపురం : మండలంలోని ఎర్రబల్లి వద్ద ఉన్న పాపాఘ్నినది నుంచి ఇసుక తరలిస్తున్న 10 ట్రాక్టర్లను మండల తహసీల్దార్‌ సరస్వతి పట్టుకుని కార్యాలయం వద్దకు తరలించారు. బిల్లులన్ని సక్రమంగా ఉండటంతో వాటిని వదిలి వేసినట్లు తహసీల్దార్‌ తెలిపారు. అలాగే మరో 5 టిప్పర్లు ఎర్రమట్టి తరలిస్తుండగా ఎస్‌ఐ హృషికేశ్వర్‌రెడ్డి పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వాటిని పరిశీలించి అన్ని అనుమతులు ఉంటే వదిలి వేస్తామని, లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.

యువకుడి ఆత్మహత్య

మదనపల్లె : తల్లిదండ్రులు మందలించారని ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగింది. కొత్తవారిపల్లె పంచాయతీ గుడిసివారిపల్లెకు చెందిన వినయ్‌కుమార్‌, ప్రేమకళ దంపతుల కుమారుడు సుశాంత్‌కుమార్‌(19) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం పనులు ముగించుకుని మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు కుమారుడిని గట్టిగా మందలించారు. దీంతో మనస్తాపం చెందిన సుశాంత్‌కుమార్‌ గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని కిందకు దించి హుటాహుటిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు చికిత్సలు అందిస్తుండగానే, సుశాంత్‌కుమార్‌ మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

వ్యక్తి ఆత్మహత్యాయత్నం

మదనపల్లె : అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం తంబళ్లపల్లె మండలంలో జరిగింది. కుక్కరాజుపల్లెకు చెందిన గోపాల్‌రెడ్డి కుమారుడు శివరామరెడ్డి(50) పలువురి వద్ద అధికమొత్తంలో అప్పులు చేశాడు. ఇటీవల రుణదాతల ఒత్తిడి పెరగడంతో శుక్రవారం ఇంటివద్ద పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌ వాహనం ద్వారా మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement