పర్యావరణానికి హాని కలిగించవద్దు

విద్యుత్‌ శాఖ అధికారులు, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న పర్యవేక్షక ఇంజినీరు ఎస్‌. రమణ  
 - Sakshi

కడప కార్పొరేషన్‌: పర్యావరణానికి హాని కలిగించని రీతిలో మానవ జీవన శైలి ఉండాలని విద్యుత్‌ శాఖ(ఆపరేషన్‌) పర్యవేక్షక ఇంజినీరు ఎస్‌. రమణ అన్నారు. శుక్రవారం స్థానిక విద్యుత్‌ భవన్‌లో పర్యావరణాన్ని రక్షించడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిషన్‌ లైఫ్‌ (లైఫ్‌ స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌) కార్యక్రమం నిర్వహించి, అధికారులు, ఉద్యోగులతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనరులను వివేకం లేని, విధ్వంసకర వినియోగానికి బదులుగా బుద్ది పూర్వక, ఉద్దేశపూర్వక వినియోగం కోసం ‘లైఫ్‌’ అనే మహత్తర కార్యక్రమం చేపట్టారన్నారు. ప్రజలు ప్రకృతితో సమకాలికమైన, హాని కలిగించని జీవన శైలిని ఆచరించాలన్నారు. ఇందులోభాగంగా విద్యుత్‌ ఆదా చేయుటకు ఎల్‌ఈడీ బల్బులు వాడటం, ఎయిర్‌ కండీషనర్ల ఉష్ణోగ్రత 24 డిగ్రీల వద్ద ఉంచడం, నీటిని చల్లబరుచుకోవడానికి రిఫ్రిజిరేటర్‌కు బదులు కుండలు వాడటం, తరచుగా వాడే ఎలక్ట్రానిక్‌ వస్తువులకు స్మార్ట్‌ స్విచ్‌లను ఏర్పాటు చేసుకోవడం, గ్రీజర్ల స్థానంలో సోలార్‌ హీటర్లు వాడటం, పగటిపూట లైట్లు, ఫ్యాన్లకు బదులు సహజ గాలిని, వెలుతురును వాడుకోవడం వంటి పద్దతులు పాటించాలన్నారు. ప్రజా రవాణాకు ఇంధన ఖర్చు తగ్గించడం, స్వల్ప దూరాలకు సైకిల్‌ వాడటం, ట్రెడ్‌మిల్‌కు బదులు బయట పరుగెత్తడం వంటివి చేయాలన్నారు. మొక్కలను విరివిగా పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎల్‌. నరసింహ ప్రసాద్‌, సోమ శ్రీనివాసులు, సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ జి. మధుకుమార్‌, అకౌంట్‌ ఆఫీసర్‌ మల్లికార్జున, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు పాల్గొన్నారు.

Read latest YSR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top