నేటి నుంచి పసుపు కొనుగోలు

కడప మార్కెట్‌ యార్డులో అమ్మకానికి 
తెచ్చిన పసుపుకొమ్ములు   - Sakshi

కడప అగ్రికల్చర్‌: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతన్నలను అడుగడుగునా ఆదుకుంటోంది. పంట దిగుబడులను అధిక రేట్లతో కొనుగోలు చేస్తోంది. మొన్న శనగలను బహిరంగ మార్కెట్‌కంటే అధిక ధర చెల్లించి కొనుగోలు చేసిన ప్రభుత్వం తాజాగా పసుపు కొనుగోలును కూడా ప్రారంభిస్తోంది. ప్రస్తుతం పసుపుధర బహిరంగ మార్కెట్‌లో నాణ్యతను బట్టి కింట్వాల్‌ రూ. 5300 నుంచి రూ.5900 వరకు ధర పలుకుతోంది. అలాంటిది ప్రభుత్వం మాత్రం క్వింటాల్‌ పసుపు మద్దతుధరను రూ. 6850 చెల్లించనుంది. దీంతో పసుపు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

● జిల్లావ్యాప్తంగా ఈ సీజన్‌లో రైతుల నుంచి 5556 మెట్రిక్‌ టన్నుల పసుపు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం జిల్లాలో ఆరు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో పసుపు అధికంగా సాగు చేసే సిద్దవటం, పోరుమామిళ్ల, మైదుకూరు, ఖాజీపేట, జమ్మలమడుగు, పెండ్లిమర్రి మండలాల పరిధిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి రైతు వద్ద నుంచి 30 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయనున్నారు. ఈ కేంద్రాలను శనివారం ప్రారంభించనున్నారు. మైదుకూరులోని పసుపు కొనుగోలు కేంద్రాన్ని జేసీ గణేష్‌కుమార్‌ ప్రారంభించనున్నారు.

జిల్లాలో 4784 ఎకరాల్లో సాగు...

జిల్లావ్యాప్తంగా 25 మండలాల్లో 153 రైతు భరోసా కేంద్రాల పరిధిలో గత ఖరీఫ్‌లో 4122 మంది రైతులు 4784 ఎకరాల్లో పసుపు పంటను సాగు చేశారు. 16120 మెట్రిక్‌ టన్నులు దిగుబడి రావచ్చని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో పసుపు కొనుగోలుకు సంబంధించి ఇప్పటి వరకు 2362 మంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరి ద్వారా నేటి నుంచి పసుపు కొనుగోలు చేయనున్నారు. ఈ పసుపు కొనుగోలును ఈ నెల 12వ తేదీ వరకు మాత్రమే కొనసాగించనున్నారు.

జిల్లాలో 6 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

5556 మెట్రిక్‌ టన్నుల కొనుగోలు లక్ష్యంగా అడుగులు

మార్కెట్‌ ధరకంటే అదనంగా ధర చెల్లింపు

మైదుకూరులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న జేసీ

Read latest YSR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top