గాండ్రింపులులు

- - Sakshi

ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో 8–10 మధ్య పులులు

శ్రీశైలం బయోల్యాబ్‌లో విశ్లేషణ ప్రక్రియ

డేటాలోని చిత్రాలు పరిశీలన

ఎఫ్‌డీపీసీ ఆధ్వర్యంలో చేపట్టిన పులుల గణన

వివిధ రేంజిలలో 376 కెమెరాలు ఏర్పాటు

రాజంపేట: శ్రీశైలం నుంచి శేషాచలం వరకు విస్తరించి ఉన్న అభయారణ్యంలో పులుల గాండ్రింపులు వినిపిస్తున్నాయి. వైఎస్సార్‌, అన్నమయ్య, గిద్ద లూరు, తిరుపతిలో టైగర్‌ కారిడార్‌ కొనసాగుతోంది. నాగార్జున సాగర్‌లోని శ్రీశైలంలో టైగర్‌ రిజర్వు అటవీ ప్రాంతంలో గుండ్ల బ్రహ్మేశ్వర వైల్డ్‌లైఫ్‌ అభ యారణ్యం నుంచి టైగర్‌ కారిడార్‌ ప్రారంభమైంది.

పులుల గణన...

శ్రీశైలం టైగర్‌ ప్రాజెక్టు (ఎఫ్‌డీపీసీ) ఆధ్వర్యంలో పులుల గణన చేపడుతున్నారు. పులుల గణన రెండు బ్లాకులలో జరుగుతుంది. నాలుగేళ్లకొకసారి చేసే గణన బ్లాక్‌–3లోకి వస్తుండగా , ప్రతి ఏడాది జరిపే గణన బ్లాక్‌–4 కిందికి వస్తుంది. ఇటీవల బ్లాక్‌–4లోని వార్షిక గణనలో టైగర్‌ కారిడార్‌ ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరి 20 నుంచి అటవీశాఖాధికారుల గణన ప్రక్రియ ప్రారంభమైంది.

పెరుగుతున్న పులుల సంఖ్య..

2021లో ఆరు పులులు ఉండగా, 2022లో వాటి సంఖ్య తొమ్మిదికి చేరినట్లు అటవీ వర్గాల సమాచారం. 2019లో బద్వేలు, సిద్ధవటం అటవీ ప్రాంతాల్లో కూడా పులులు ఉండేవని అప్పటి సమాచారం. ఈ సారి గణనలో అవి కెమెరాలకు చిక్కలేదు. అయితే పెనుశిల అభయారణ్యం, శేషాచలం అటవీ ప్రాంతాల వైపు వెళ్లినట్లు అటవీవర్గాలు భావిస్తున్నాయి.

ఎక్కడెక్కడ..

టైగర్‌ కారిడార్‌ నంద్యాల, గిద్దలూరు, వైఎస్సార్‌, అన్నమయ్య, తిరుపతి డివిజన్లలో నిర్వహించారు. నంద్యాల డివిజన్‌లోని చలమరుద్రవరం (రేంజ్‌), గిద్దలూరులో గుండ్లకమ్మ, వైఎస్సార్‌ జిల్లాలో ప్రొద్దు టూరు, వనిపెంట, పోరుమామిళ్ల, బద్దేలు, సిద్దవ టం, ఒంటిమిట్ట, ముద్దనూరు, అన్నమయ్య జిల్లాలో చిట్వేలు, రాయచోటి , బాలపల్లె తిరుపతి జిల్లాలో భాకరాపేట, తిరుపతి రేంజిలోని అటవీ ప్రాంతాల్లో సాంకేతిక డిజిటల్‌ కెమెరాలు అమర్చి సర్వే చేశారు.

డేటాలో చిత్రాలు శ్రీశైలం బయోల్యాబ్‌కు ..

ఆయా రేంజిలలో 188 లోకేషన్లకు గాను మొత్తం 376 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో 127 కెమెరాలు అమర్చారు. 40 రోజుల పాటు జరిగిన గణనలో 20 రోజులకొక సారి కెమెరాలు తీసి వాటిలోని చిత్రాలను సేకరించారు. అదే ప్రదేశాలలో మళ్లీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

మార్చినెలాఖరుకు గణన పూర్తి...

రెండవ విడతలో జరిపిన గణన మార్చినెలాఖరు నాటికి పూర్తికావడంతో అన్ని డివిజన్‌లలో అమర్చిన కెమెరాల్లోని డేటాను ఆయా అటవీశాఖాధికారులు శ్రీశ్రైలంలోని టైగర్‌ బయోల్యాబ్‌కు పంపారు. వాటి లోని చిత్రాలను బయోల్యాబ్‌ ప్రతినిధులు క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. పోరుమామిళ్ల, వనిపెంట అడవుల్లో ఆరు పులులు కెమెరాలకు చిక్కినట్లుగా అటవీ అధికారుల నుంచి అందిన ప్రాథమిక సమాచారం.

ప్రాథమికంగా 8 నుంచి 10 పులుల సంచారం

ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలోని టైగర్‌ కారిడార్‌ చేపట్టిన పులుల గణనలో ప్రాథమికంగా 8 నుంచి 10 లోపు పులులను అధికారులు గుర్తించారు. పులుల వార్షిక గణనలో భాగంగా అడవుల్లో అమర్చిన విదేశీ సాంకేతిక డిజిటల్‌ కెమెరాల ద్వారా వాటి సంఖ్యను కొనుగొన్నారు. పలుల గణన ప్రక్రియ ఇటీవల ముగియగా ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో మొత్తం ఎన్ని పులులు ఉన్నాయో పక్కాగా నిర్ధారించే పరిస్థితులు ఇంకా కనిపించడంలేదు. దానికి శ్రీశైలంలోని టైగర్‌ బయోల్యాబ్‌లో శాస్త్రవేత్తలు కెమెరాల్లో లభ్యమైన చిత్రాలపై విశ్లేషణ చేసి నిర్ధారించనున్నారు.

కెమెరాల్లో లభ్యమైన చిత్రాలు టైగర్‌ ల్యాబ్‌కు పంపాం

జిల్లాలోని పలు రేంజ్‌లలో పులుల గణన నిమిత్తం కెమెరాలను ఏర్పాటుచేశాం. టైగర్‌ జాడ కోసం ఏర్పాటుచేసిన కెమెరాల్లో లభ్యమైన చిత్రాలు శ్రీశైలంలోని టైగర్‌ బయోల్యాబ్‌కు పంపాం. డేటాలోని చిత్రాల పరిశీలన కొనసాగుతోంది. పులుల సంఖ్య త్వరలో వెల్లడవుతుంది. – పీవీ సందీప్‌రెడ్డి, డీఎఫ్‌ఓ, కడప

Read latest YSR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top