రైతన్నకు యంత్ర సేవ

- - Sakshi

ఆర్బీకే, క్లస్టర్‌ కేంద్రాలకు ట్రాక్టర్లు, కంబైన్డ్‌ హార్వెస్టర్లు

రాయితీ కింద రూ. 226.50 లక్షలు విడుదల

కలెక్టర్‌ విజయరామరాజు

కడప సెవెన్‌రోడ్స్‌ : వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గుతుందని కలెక్టర్‌ విజయరామరాజు అన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ యంత్ర సేవా పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం గుంటూరులో వైఎస్సార్‌ యంత్ర సేవ పథకం 2022–23 మెగా మేళా –2ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు తిరుపాల్‌రెడ్డి, ఉద్యాన సలహాదారు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, వ్యవసాయశాఖ జేడీ నాగేశ్వరరావు, రైతులు కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తిలకించారు.

● అనంతరం కలెక్టర్‌ విజయరామరాజు రైతు భరోసా కేంద్రాల కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్ల గ్రూపులకు, క్లస్టర్‌ స్థాయి కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్ల గ్రూపులకు ట్రాక్టర్లు, కంబైన్డ్‌ హార్వెస్టర్ల పంపిణీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యంత్ర సేవా పథకం ద్వారా తక్కువ అద్దెకే రైతులకు యంత్ర పరికరాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. జిల్లాలో రూ. 5150.15 లక్షల వ్యయంతో విత్తు నుంచి కోత వరకు రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచుతోందన్నారు. ఆర్బీకే స్థాయిలో 432 యంత్ర సేవా కేంద్రాలకు ఒక్కో దాంట్లో రూ. 15 లక్షల విలువైన పరికరాలు సమకూరుస్తోందన్నారు. వరి ఎక్కువగా పండించే 20 క్లస్టర్‌ స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు ఒక్కోచోట రూ. 25 లక్షల విలువైన కంబైన్డ్‌ హార్వెస్టర్లను అందిస్తున్నామన్నారు. యంత్ర పరికరాలు, వాటి అద్దె, సంప్రదించాల్సిన వ్యక్తుల వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తారన్నారు. యాంత్రీకరణలో భాగంగా దుక్కిదున్నే యంత్రాలు, దమ్ము, చదును, వరి నాటు, నూర్పిడి, కోత, ఎరువులు, సస్యరక్షణ, కలుపుతీత తదితర పనులకు యంత్రాలు అందుబాటులో ఉంటాయన్నారు. సాగు యంత్రాలు, వ్యవసాయ పనిముట్లను 40 శాతం రాయితీతో ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఆప్కాబ్‌, డీసీసీ బ్యాంకు ద్వారా 50 శాతం రుణంగా తక్కువ వడ్డీకి ఇస్తున్నామన్నారు. జిల్లాలోని 47 ఆర్బీకే కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్ల గ్రూపులకు, నాలుగు క్లస్టర్‌ స్థాయి గ్రూపులకు ప్రభుత్వం 226.50 లక్షల రూపాయలు రాయితీగా విడుదల చేస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో జేసీ గణేష్‌కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, ఉద్యానశాఖ డీడీ రాజీవ్‌ మైఖేల్‌, డీసీసీ అధికారి సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.

Read latest YSR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top