ఎర్రస్మగ్లర్లపై దాడులు

- - Sakshi

నలుగురు స్మగ్లర్ల అరెస్ట్‌,

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

నిందితుల్లో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌బీఓ)

కడప అర్బన్‌ : జిల్లాలోని మైదుకూరు మండలం లంకమల్ల అటవీప్రాంతం నుంచి ఎర్రచందనం చెట్లను అక్రమంగా నరికి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారిపై పోలీసులు నిఘా ఉంచారు. ఇదే మండలం యాకర్లపాలెం గ్రామం సమీపంలోని తెలుగుగంగ రిజర్వాయర్‌ సీ– బండ్‌ వద్ద కొంతమంది స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను వాహనంలోకి లోడ్‌ చేస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. వారిలో కొందరు పోలీసులపై రాళ్లదాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించగా నలుగురిని అరెస్ట్‌ చేశారు. శుక్రవారం కడపలోని శ్రీపెన్నార్‌శ్రీకాన్ఫరెన్స్‌హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలియజేశారు. అరెస్టయిన వారిలో తమిళనాడు రాష్ట్రంలో తిరువన్నామలై జిల్లా ముత్నతూర్‌ గ్రామానికి చెందిన వెలిముత్తు తంగరాజు, పోలూరు తాలూకా బర్కుర్‌ గ్రామానికి చెందిన వెల్లియన్‌ సౌందర్‌ శంకర్‌, వైఎస్సార్‌ జిల్లా వల్లూరు మండలం పెద్ద లేవాకు గ్రామం పెరికల రాజశేఖర్‌, ఖాజీపేట మండలం ముత్తలూరు పాడు గ్రామానికి చెందిన టి. రామసుబ్బారెడ్డి ఉన్నారు. వీరిలో రాజశేఖర్‌ గతంలో 2004– 2013 వరకు రైల్వేకోడూరులో ఫారెస్ట్‌ గార్డ్‌గా పనిచే శాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సహకరించడంతో ఇతనిపై కేసు నమోదు చేసి విధుల నుంచి తొలగించారు. అనంతపురం జిల్లా పెనుగొండలో ఒక ఎర్రచందనం కేసు ఉంది. ఇతనితో పాటు అరెస్టయిన టి. రామసుబ్బారెడ్డి గంజికుంట సెక్షన్‌, నీలాపురం బీట్‌ ఆఫ్‌ వనిపెంట రేంజ్‌లో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. స్మగ్లర్ల నుంచి 300 కిలోల బరువున్న ఏడు ఎర్రచందనం దుంగలను, కారును, ద్విచక్రవాహనాన్ని నాలుగు సెల్‌ఫోన్‌లను సీజ్‌ చేశారు. వీరిని అరెస్ట్‌ చేయడంలో కృషి చేసిన జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్‌) తుషార్‌ డూడీ, మైదుకూరు డిఎస్పీ వంశీధర్‌గౌడ్‌, టాస్క్‌ఫోర్స్‌, ఫ్యాక్షన్‌ జోన్‌ డిఎస్పీ చెంచుబాబుల ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ సీఐ ఎం. నాగభూషణ్‌, మైదుకూరు అర్బన్‌ సీఐ బి.వి. చలపతి, టాస్క్‌ఫోర్స్‌ ఆర్‌ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, టీం సభ్యులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

దుంగలు తరలిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

జిల్లాలో ఎర్రచందనం చెట్లను నరికినా, దుంగలుగా చేసి అక్రమంగా తరలించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామనీ జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ హెచ్చరించారు..జిల్లాలో ఈ ఏడాది అరెస్టయిన ఎర్రచందనం స్మగ్లర్లలో ఇప్పటివరకు ఏడుగురిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించామనీ జిల్లా ఎస్పీ తెలియజేశారు.

33 దుంగల పట్టివేత

పోరుమామిళ్ల : మండలంలోని రామేశ్వరం గ్రామంలో గురువారం రాత్రి కడప టాస్క్‌ఫోర్స్‌ పోలీస్‌ అధికారులు ముందుగా తెలిసిన సమాచారంతో రాచకొండు రామయ్య ఇంటిపై దాడి చేసి 33 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిందితుడు పరారయ్యాడని, అతను గతంలో పోరుమామిళ్ల అటవీశాఖలో ప్రొటెక్షన్‌ వాచర్‌గా 3 సంవత్సరాలు పని చేసినట్లు తెలిసింది. గంగాయపల్లె, రామేశ్వరం, టేకూరుపేట చెక్‌పోస్టు పరిధిలో పనిచేసిన అతను ఎర్రచందనం గురించి బాగా తెలుసుకొని, ఓ గ్రూపు తయారు చేసుకొని స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అట్లూరు మండల పరిధిలో 26 దుంగలు స్వాధీనం

అట్లూరు : మండల పరిధిలో గురువారం రాత్రి అక్రమరవాణాకు సిద్ధంగా ఉంచిన 26 ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు బద్వేలు, అట్లూరు మండల పరిధిలోని పలువురు ఎర్రచందనం దొంగలను టాస్క్‌పోర్సు పోలీసులు అదుపులోకి తీసుకు విచారించారు. వారిచ్చిన సమాచారం మేరకు పెనుశిలనరసింహా అభయారణ్యం పరిధిలోని ముత్తుకూరు బీట్‌లో గంగప్ప భావి దగ్గర రవాణా చేసేందుకు సిద్దంగా ఉంచిన 26 దుంగలను స్వాధీనం చేసకున్నారు.ఈవిషయమై సిద్దవటం రేంజ్‌అధికారి ప్రసాద్‌ను వివరణ అడుగగా దుంగలు దొరికిన విషయం వాస్తవమే అన్నారు. అవి టాస్క్‌పోర్సు పోలీసుల ఆధీనంలో ఉన్నాయని తెలిపారు.

స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు

నిందితుల అరెస్ట్‌ వివరాలను తెలియజేస్తున్న జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌

Read latest YSR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top