భూదాన్‌పోచంపల్లి : భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం టూరిస్ట్ అండ్ క్రియేటివ్ ఎకానమీ డెవలప్‌మెంట్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ పరిశ్రమ, చేనేత కార్మికుల జీవన స్థితిగతులను అధ్యయనం చేశారు. కన్సల్టెన్సీ ప్రతినిధులు సాహితీ, శ్రీనివాస్ పోచంపల్లి టూరిజం పార్కు, చేనేత గృహాలు, పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ, చేనేత సహకార సంఘం కార్యాలయాన్ని సందర్శించారు. ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఎలాంటి డిజైన్లు రూపొందిస్తున్నారని, చేనేత కార్మికులు తయారుచేసిన వస్త్రోత్పత్తులను ఎక్కడ మార్కెటింగ్ చేస్తున్నారని, వారికి లభిస్తున్న గిట్టుబాటు ధర, చేనేత సహకార సంఘాల పాత్ర, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను తెలుసుకున్నారు. మెరుగైన జీవనానికి ప్రభుత్వాలు ఏమి చేస్తే బాగుంటుందని ఫీడ్ బ్యాక్ తీసుకొన్నారు. ఈ కార్యక్రమలో అడిషనల్ డీఆర్‌డీఓ కోట జంగారెడ్డి, జిల్లా చేనేత జౌళిశాఖ అభివృద్ది అధికారి జగదీశ్, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, సహకారసంఘం మేనేజర్ రుద్ర అంజనేయులు, సీసీ కొండమడుగు మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.


