ప్రజారోగ్య రక్షణలో నర్సులు కీలకం
భువనగిరి : ప్రజల ఆరోగ్యం, వారి శ్రేయస్సును కాంక్షిస్తూ నిస్వార్థంగా సేవలందించడంలో నర్సుల పాత్ర కీలకమని బీబీనగర్ ఎయిమ్స్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ లత పేర్కొన్నారు. ఎయిమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్–2025 విద్యార్థుల కోసం దీపాలంకరణ, ప్రమాణస్వీకార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నర్సింగ్ విద్యార్థులు తమ క్లీనికల్ ప్రాక్టీస్‌లో భాగంగా రోగుల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకోవడంతో పాటు సీనియర్లను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రోగుల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో నర్సింగ్ విద్యార్థులు పోషించాల్సిన పాత్రపై వారికి అవగాహన కల్పించారు. అనంతరం వారిచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ మహేశ్వర్ లక్కిరెడ్డి, నితిన్ జాన్, నాగ్‌పూర్ ఎయిమ్స్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రజనీ తదితరులు పాల్గొన్నారు.
బీబీనగర్ ఎయిమ్స్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లత


