ట్యాంక్‌బండ్ తరహాలో సుందరీకరణ
ఆలేరు: చెరువులకు పూర్వ వైభవం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. సోమవారం ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్‌పేట పెద్ద చెరువు సుందరీకరణ పనులకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాదం అందించేలా చెరువుల సుందరీకరణకు ప్రభుత్వ ప్రాధాన్యమిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్రాల నిధులతో చెరువులను మినీ ట్యాంక్‌బండ్‌లుగా సుందరీకరించడమే లక్ష్యమన్నారు. రైతులకు సాగునీరు అందేలా భవిష్యత్‌లో చెరువుల వద్ద చెక్‌డ్యాంల నిర్మాణాలకు కృషి చేస్తానని చెప్పారు. ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ చెరువు చుట్టూ బండింగ్, జంగల్ కటింగ్, వాకింగ్ ట్రాక్, రకరకాల మొక్కలతో సుందరీకరణ, విద్యుత్‌దీపాలు తదితరు పనులు చేపట్టనున్నట్టు వివరించారు. ఆలేరు మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇజాజ్, కాంగ్రెస్ నాయకులు చింతలఫణి శ్రీనివాస్‌రెడ్డి, సాగర్‌రెడ్డి, జెట్ట సిద్ధులు, పబ్లిక్‌హెల్త్ అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


