బాలికలకు అథ్లెటిక్స్ లీగ్
నల్లగొండ టూటౌన్: బాలికల్లో క్రీడానైపుణ్యాన్ని వెలికితీయడమే లక్ష్యంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ‘అస్మిత ఖేలో ఇండియా’ పోటీలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా బాలికలను ఒలింపిక్స్‌కు సన్నద్ధం చేయించాలని కేంద్ర క్రీడా యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంకల్పించింది. ఇందులో భాగంగా భారత అథ్లెటిక్స్ సమాఖ్య ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా బాలికల కోసం ప్రత్యేకంగా ‘అస్మిత ఖేలో ఇండియా’ (Achieving sports milestone by inspiring women through action) అథ్లెటిక్స్ లీగ్స్ నిర్వహించనున్నారు. ఇది వ్యక్తిగత క్రీడ కావడంతో బాలికలు సత్తా చాటి విజేతలుగా నిలిచే అవకాశం ఉంటుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ ఔట్‌డోర్ స్టేడియంలో 14వ తేదీ (శుక్రవారం) జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఽఆధ్వర్యంలో అథ్లెటిక్స్ లీగ్ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ లీగ్ పోటీలకు 150 మంది బాలికలు హాజరుకానున్నట్లు నిర్వాహకులు భావిస్తున్నారు.
నిర్వహించే క్రీడలు
è అండర్– 14 విభాగం: ట్రయథ్లాన్ – ఏ 60 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌జంప్, హైజంప్,
è ట్రయథ్లాన్– బీ, 60 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌జంప్, షార్ట్‌ఫుట్ త్రో
è ట్రయథ్లాన్ – సీ, 60 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌జంప్, కిడ్స్ జావెలిన్, 600 మీటర్ల పరుగు
è అండర్– 16 విభాగం: 60 మీటర్ల పరుగు పందెం, 600 మీటర్ల పరుగు, హైజంప్, లాంగ్‌జంప్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో
భారత క్రీడా సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ
జిల్లా కేంద్రాల్లో నిర్వహించే అథ్లెటిక్స్ లీగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఇతర నగరాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇక్కడ ప్రతిభ కనబరిచిన వారికి జాతీయ శిక్షణ శిబిరాలైన సాయ్ (భారత క్రీడా సంస్థ) ఆధ్వర్యంలోని భోపాల్, బెంగళూరు, తిరువనంతపురం, పటియాల ప్రాంతాల్లో భారత అథ్లెటిక్స్ కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దనున్నారు. సాయ్‌లో శిక్షణ పొందే వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారు.
లీగ్ పోటీలకు అర్హులు వీరే..
అథ్లెటిక్స్ లీగ్ పోటీలు అండర్–14 విభాగంలో పాల్గొనాలంటే 21– 12– 2011 నుంచి 20– 12– 2013 మధ్యలో జన్మించిన వారు మాత్రమే అర్హులు. అండర్ – 16 విభాగంలో పాల్గొనేవారు 21–12–2009 నుంచి 20–12–2011 మధ్యలో జన్మించిన వారై ఉండాలి.
విద్యార్థినుల్లో క్రీడానైపుణ్యం వెలికితీసేందుకు ‘అస్మిత ఖేలో ఇండియా’ పోటీలకు శ్రీకారం
రేపు నల్లగొండలోని మేకల అభినవ్ ఔట్‌డోర్ స్టేడియంలో పోటీల నిర్వహణ
గ్రామీణ క్రీడాకారులకు వరం
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గ్రామీణ క్రీడాకారులకు వరం లాంటిది. బాలికలు స్వతహాగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సాయ్‌లో శిక్షణ పొందవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించే అవకాశం వస్తుంది.
– శంభులింగం, అథ్లెటిక్స్ అసోసియేషన్
జిల్లా ప్రధాన కార్యదర్శి
ప్రతిభ చాటేందుకు చక్కని అవకాశం
ఖేలో ఇండియాలో భాగంగా బాలికలకు అథ్లెటిక్స్ లీగ్ పోటీలు నిర్వహించడం గొప్ప విషయం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎంతో మంది బాలికలు జాతీయ స్థాయిలో శిక్షణ పొందవచ్చు.
– జగ్జీవన్‌రామ్, అథ్లెటిక్స్ అసోసియేషన్
జిల్లా అధ్యక్షుడు
బాలికలకు అథ్లెటిక్స్ లీగ్
బాలికలకు అథ్లెటిక్స్ లీగ్


