మామిడి పూత దశలో సస్యరక్షణ ఇలా..
గుర్రంపోడు: నల్లగొండ జిల్లాలో 2 వేల ఎకరాలు, సూర్యాపేటలో 12వేల ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 11 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మామిడి తోటలు పూత వచ్చే దశలో ఉన్నాయి. పూత దశకు ముందు సమగ్ర యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించడంతో అధిక దిగుబడులు సాధించవచ్చు. వివిధ దశలో ఉన్న పూత సంపూర్ణంగా రావడానికి ప్రస్తుతం చలి పరిస్థితుల్లో పూత మొగ్గలను ఉత్తేజపరిచి త్వరగా పూత తెప్పించడానికి ఈ పద్ధతులు పాటిస్తే త్వరగా పూత బయటకు వస్తుందని ప్రాంతీయ ఉద్యానవనశాఖాధికారి మురళి సూచిస్తున్నారు.
పూత సమయంలో తీసుకోవాల్సిన
జాగ్రత్తలు
● మామిడిలో జూన్ నుంచి అక్టోబర్ వరకు రైతులు పాటించిన సమగ్ర సాగు పద్ధతులను బట్టి అక్టోబర్ నవంబర్, డిసెంబర్ మాసాల్లో ముదిరిన కొమ్మల్లో మొగ్గ ఏర్పడుతుంది. కానీ జిల్లాలో వాతావరణ పరిస్ధితులను బట్టి ఎక్కవగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూత వస్తుంది.
● ఆయా రకం, వాతావరణ పరిస్థితులను బట్టి డిసెంబరు రెండవ పక్షం నుంచి ఫిబ్రవరి వరకు పూత మొగ్గలు వస్తాయి.
● పూత, పిందె రాలిపోవడానికి నీరు, పోషకలోపమే కారణం. డ్రిప్పు పైపులు అమర్చే పద్ధతి కూడా దిగుబడులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. నీటి తడులు ఇచ్చేటప్పుడు మొదటి, రెండు తడులు తేలికపాటి ఇచ్చిన తర్వాతనే మూడో తడి పూర్తిగా ఇవ్వాల్సి ఉంటుంది. లేని పక్షంలో పూత, పిందె రాలిపోయే ప్రమాదం ఉంది.
● పచ్చి పూత దశలో తేనమంచు నివారణకు థయోమిత్సామ్ 200 గ్రాములు లేదా పిప్రోనిల్ 80 శాతం, 100 మిల్లీలీటరు ఇమిగాక్లోప్రిడ్, బూడిద తెగులు నివారణకు ఒక లీటరు హెక్సాకొనజోల్, 2లీటర్లు వేపనూనెను 500 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
● పూత విచ్చుకున్న 10–15 రోజుల వరకు ఎలాంటి పురుగుమందులు పిచికారీ చేయొద్దు.
● ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌లో తప్పనిసరిగా యూరియా, పొటాష్, బోరాన్ ఎరువులు వాడుకోవాలి. ఎరువులు ఒకేసారి వేసే కంటే దఫాలుగా వేస్తే మంచి ఫలితం ఉంటుంది.
● పిందెలు బఠాణీ సైజుకు వచ్చిన తర్వాత పది సంవత్సరాలు దాటిన ప్రతి చెట్టుకు డీఏపీ 700 గ్రాములు, యూరియా 400 గ్రాములు , పొటాష్ 600 గ్రాములు ప్రతి చెట్టుకు వేసుకుని నీరు పెట్టాలి.
పిందె రాలకుండా అదేవిధంగా పిందెలు బఠాణీ సైజులో ఉండి పసుపు రంగులోకి మారి రాలుతుంటే మల్టీకే(13–0–45), 2.5 కేజీ, సూక్ష్మపోషక మిశ్రమం, ఫ్లానోఫిక్స్ 100 ఎంఎల్‌లను కలిపి 500 లీటర్ల నీటిని కలిపి ఆకులన్నీ తడిచేలా పిచికారీ చేసుకోవాలి.
పండు ఈగ నివారణకు లింగాకర్షణ బుట్టలను ఎకరానికి 10–25 ఏర్పాటు చేసి 20 రోజులకు ల్యూర్‌ను మారుస్తూ పంట పూర్తయ్యే వరకు కొనసాగించాలి.
మామిడి పూత దశలో సస్యరక్షణ ఇలా..


