ఇంట్లో నగదు అపహరణ
దేవరకొండ: దేవరకొండ పట్టణంలోని ఓ ఇంట్లో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రూ.8లక్షలు అపహరించారు. సీఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రమావత్ జబ్బార్ దేవరకొండలో పాన్‌షాప్ నిర్వహిస్తూ చిట్టీల వ్యాపారం సాగిస్తున్నాడు. హనుమాన్‌నగర్‌లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. రోజు మాదిరిగా మంగళవారం మధ్యాహ్నం సమయంలో భార్యాభర్తలు ఇంటికి తాళం వేసి పాన్‌షాప్ వద్దకు వెళ్లారు. తిరిగి వారు ఇంటికి చేరుకునే సరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో రూ.8లక్షలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దేవరకొండ సీఐ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
నెట్ సెంటర్‌లో చోరీ
చిట్యాల: చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని ఇంటర్‌నెట్ సెంటర్‌లో మంగళవారం రాత్రి రూ.10వేల నగదు చోరీకి గురైంది. గ్రామంలోని సర్వీస్ రోడ్డులోని ఇంటర్‌నెట్ సెంటర్ నిర్వాహకుడు శేఖర్ రోజు మాదిరిగా మంగళవారం రాత్రి సెంటర్‌కు తాళం వేసి వెళ్లాడు. బుధవారం ఉదయం వచ్చి చూసేటప్పటికి తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లిచూడగా క్యాష్ కౌంటర్‌లోని రూ.10వేల నగదు అపహరణకు గురైనట్లు గుర్తించాడు. వెంటనే చిట్యాల పోలీసులకు సమాచారం అందించాడు. చిట్యాల ఏఎస్‌ఐ వెంకన్న ఇంటర్‌నెట్ సెంటర్‌ను పరిశీలించారు. బాధితుడు శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వాగు నీటిగుంతలో
పడి రైతు దుర్మరణం
కనగల్: వాగు నీటిగుంతలో పడి రైతు మృతిచెందాడు. బుధవారం కనగల్ ఎస్‌ఐ రాజీవ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కనగల్ గ్రామానికి చెందిన రైతు చిట్టిమల్ల పెద్దులు(55) గత ఆదివారం సాయంత్రం పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. అప్పటి నుంచి పెద్దులు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. బుధవారం మధ్యాహ్నం సమయంలో వాగు నీటిలో మృతదేహం తేలి ఉండడాన్ని పశువుల కాపరులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహం పెద్దులుదిగా గుర్తించి కుటుంబసభ్యులకు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
తహసీల్దార్ అవమానించాడని మహిళ ఆవేదన
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఇసుక అనుమతుల కోసం వెళ్తే తహసీల్దార్ అవమానించాడంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని నశీంపేట గ్రామానికి చెందిన ఒంటరి మహిళ వత్సవాయి లలితకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. నిర్మాణ పనులు బేస్‌మెంట్ లెవల్ వరకు పూర్తికాగా.. ఇసుక కొరత కారణంగా నిలిచిపోయింది. ఈ విషయమై తహసీల్దార్‌ను కలిసేందుకు వెళ్లగా తనను దుర్భాషలాడి అవమానించాడని లలిత ఆరోపించింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తహసీల్దార్ అమిన్‌సింగ్‌ను వివరణ కోరగా.. ఇందిరమ్మ ఇళ్లకు జాజిరెడ్డిగూడెం మండలం నుంచి ఇసుక తెచ్చుకునేందుకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. ఏపూరు నుంచి ఇసుక రావడం లేదని, మళ్లీ అక్కడి నుంచి అనుమతులు ఇవ్వాలంటే కుదరదని చెప్పానని, తాను ఆమెను దుర్భాషలాడలేదని పేర్కొన్నారు.
క్షుద్రపూజల కలకలం
కొండమల్లేపల్లి : క్షుద్రపూజలు చేశారంటూ కలకలం రేపిన ఘటన బుధవారం డిండి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. డిండిలోని కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిలో ఏపూరు తండాకు వెళ్లే దారిలో బుధవారం గుర్తు తెలి యని వ్యక్తులు బ్యాగుపై కుంకుమ చల్లి కొబ్బరికాయలు కొడుతుండగా అటుగా వెళ్తున్న వ్యక్తులు చూశారు. దీంతో పూజలు చేస్తున్న సదరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా బ్యాగులో చీర, పూలు ఉన్నట్లు గుర్తించారు. ప్రజలను భయపెట్టేందుకే ఆకతాయిలు ఇలా చేసి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు.


