రైతువేదిక.. నిర్వహణ లేక
రాజాపేట : పంటల సాగులో రైతులకు సలహాలు, సూచనలతో పాటు శిక్షణ ఇచ్చేందుకు నిర్మించిన రైతు వేదికలు నిస్తేజంగా మారాయి. నిర్వహణకు నిధుల్లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 37 నెలలుగా ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో వ్యవసాయ విస్తరణ అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైగా పలు చోట్ల రైతువేదికలు గ్రామానికి దూరంగా నిర్మించడంతో రైతులు అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు.
జిల్లాలో 92 రైతువేదికలు
నాలుగేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం రైతువేదికలు నిర్మించింది. ప్రతి 5 వేల మంది రైతులకు ఒకటి చొప్పున జిల్లాలో 92 రైతువేదికలు ఏర్పాటు చేసింది. ఒక్కో వేదికకు రూ.22 లక్షలు వెచ్చించింది. అంతేకాకుండా రూ.3 లక్షలతో మండలానికి 3 చొప్పున 51 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) సెట్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి మంగళవారం వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు వీడియో కాన్షరెన్స్ ద్వారా రైతులకు వివిధ రకాల పంటల సాగు, యాజమాన్య పద్ధతులు, తెగుళ్ల నివారణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. మిగతా రోజుల్లో వ్యవసాయ అధికారుల ద్వారా రైతులకు అధునాతన సాంకేతిక పద్ధతులపై శిక్షణ, బ్యాంకుల రుణాల సమాచారం, పశుసంవర్ధక శాఖ వివరాలు, పంటల సాగు, వాతావరణ పరిస్థితులు, పంట మా ర్పిడి అంశాలపై సమాచారం అందిస్తున్నారు. వీటిలో మండల కేంద్రాల్లోని వేదికల్లో మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాలు కొనసాగుతుండగా.. మిగతా చోట్ల వృథాగా ఉన్నాయి.
సౌకర్యాలు అంతంతే..
పలుచోట్ల రైతువేదికల్లో నేటికీ విద్యుత్, నీటి వసతి లేదు. జిల్లాలో 92 రైతు వేదికలకు గాను 35 రైతు వేదికలు గ్రామాలకు చివరగా ఉన్నాయి. అక్కడికి వెళ్లి విధులు నిర్వహించాలంటే మహిళా ఏఈఓలు భయపడుతున్నారు. దీంతో అవి మద్యం ప్రియులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి.
35 వేదికలు నిరుపయోగం
ఫ మూడేళ్లుగా విడుదల కాని బడ్జెట్
ఫ ఏఈఓలకు భారంగా మారిన నిర్వహణ
ఫ వీడియో కాన్ఫరెన్స్‌లు, సమీక్షంలో సమయంలో చేతినుంచే ఖర్చు


