పిలాయిపల్లిలో గవర్నర్
భూదాన్‌పోచంపల్లి : మండలంలోని పిలాయిపల్లిలోని సప్తపర్ణి గోశాలను గురువారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు. అక్కడ సప్తపర్ణి ఫౌండేషన్, వేదభారతి ట్రస్ట్ సంయుక్తంగా అంధుల కొరకు బ్రెయిలీ లిపిలో రూపొందించిన భగవద్గీత, హనుమాన్‌చాలీసా గ్రంథాలను ఆవిష్కరించి మాట్లాడారు.
ఎయిమ్స్‌లో
టెలీ మెడిసిన్ సేవలు
బీబీనగర్: బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలలో టెలీ మెడిసిన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నర్సింగ్ నిపుణుల కోసం ఈకో ఇండియా సహకారంతో టెలీ మెడిసిన్ సేవలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ డైరెక్టర్ అమితా అగర్వాల్ మాట్లాడుతూ గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అంశాలను లెర్నింగ్ ద్వారా తెలుసుకునేందుకు టెలీ–మెంటరింగ్ దోహదపడుతుందన్నారు.
మీసేవ కేంద్రాలకు దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరిటౌన్ : అడ్డగూడూరు, ఆత్మకూర్ (ఎం), మోత్కూర్‌లో మీ–సేవ కేంద్రాల నిర్వహణకు దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్ హనుమంతరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రాలు నిర్వహించడానికి డిగ్రీ విద్యార్హతతో పాటుగా కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి స్థానికులై ఉండాలని, 21 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు వారు అర్హులన్నారు. ఆర్థిక స్థోమత కలిగి ఉండాలని, సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవా లని పేర్కొన్నారు. రాత, మౌఖిక పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. దరఖాస్తు ఫారాన్ని yadadri.teanga na.gov.in/ వెబ్‌సైట్ నుంచి పొందాలని సూచించారు. నవంబర్ 7వ తేదీలోగా కలెక్టరేట్‌లోని ఇన్‌వార్డు, అవుట్ వార్డులో దరఖాస్తులు అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు 9121147135 సంప్రదించాలని పేర్కొన్నారు.
నేడు భువనగిరిలో 2కే రన్
భువనగిరిటౌన్ : నేషనల్ యూనిటీ డేను పురస్కరించుకొని శుక్రవారం భువనగిరిలో 2 కే రన్ నిర్వహించనున్నట్లు పట్టణ సీఐ రమేష్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని డీసీపీ అక్షాంశ్‌యాదవ్ ప్రారంభించనున్నారని, పోలీసు సిబ్బంది రన్‌లో పాల్గొనాలని కోరారు. రైల్వే స్టేషన్ నుంచి పట్టణ పో లీస్ స్టేషన్ వరకు రన్ కొనసాగుతుందన్నారు.
ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ల బృందం పర్యటన
బీబీనగర్: ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ల బృందం గురువారం బీబీనగర్ మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించింది. పంచాయతీరాజ్ శాఖ నిర్వహణ తీరుపై వారు అధ్యయనం చేశారు. వారికి జెడ్పీ సీఈఓ శోభారాణి, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, పీఆర్ ఏఈ రాకేష్ పంచాయతీరాజ్ శాఖ పనితీరు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై వివరించారు. అనంతరం జెడ్పీ సీఈఓతో కలిసి రుద్రవెళ్లి వద్దకు వెళ్లి మూసీలో లెవల్ వంతెనపై నుంచి ప్రవహిస్తున్న వరద నీటిని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు పరిశీలించారు.
నేత్రపర్వంగా నృసింహుడి నిత్యకల్యాణం
యాదగిరిగుట్ట: యాదగిరీశుడి సన్నిధిలో గురువారం నిత్యారాధనలు ఆగమశాస్త్రం ప్రకారం ఘనంగా నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలో కొలువుదీరిన స్వయంభూ, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. ఇక ఆలయ ముఖ మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, అష్టోత్తర పూజలు నేత్రపర్వంగా చేపట్టారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.
పిలాయిపల్లిలో గవర్నర్


