ఇండస్ట్రియల్ పార్కుపై పట్టింపేదీ!
తుర్కపల్లిలో అటకెక్కిన
పారిశ్రామిక వాడ
నిరుద్యోగుల్లో నిరాశ నెలకొంది
ప్రభుత్వం పట్టించుకోవాలి
తుర్కపల్లి: తుర్కపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన ప్రతిష్టాత్మకంగా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. పరిశ్రమల విస్తరణలో భాగంగా రెండున్నర ఏళ్ల క్రితమే అప్పటి ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్‌ను ప్రతిపాదించి ఏర్పాట్లు ప్రారంభించింది. రైతుల నుంచి భూ సేకరణ సైతం పూర్తిచేసి 90 శాతం పరిహారం చెల్లించింది. కానీ, రెండేళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా పార్క్ పరిస్థితి తయారైంది.
93 ఎకరాలు సేకరణ
తుర్కపల్లి గ్రామ పరిధిలోని 72 సర్వే నంబర్‌లో 93 ఎకరాల భూమిని 76 మంది రైతులనుంచి అప్పట్లోనే ప్రభుత్వం సేకరించింది. భూ నిర్వాసితులకు పరిహారం 82 ఎకరాలకు గాను రూ.16.54 కోట్లు చెల్లించారు. 11 ఎకరాలకు పెండింగ్‌లో ఉంది. రైతుల నుంచి సేకరించిన భూమికి తోడు మరో 47 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కేటాయించి మొత్తం 140 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్ కోసం నిర్ధారించారు.
పార్కు అందుబాటులోకి
వస్తే అనేక ప్రయోజనాలు
ఇండస్ట్రియల్ పార్క్ అందుబాటులోకి వస్తే అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడం వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ప్రధానంగా తుర్కపల్లి, రాజాపేట, బొమ్మలరామారాం, జగదేవపూర్, అలేరు మండలాల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కానీ, పార్క్ ఏర్పాటులో ఎలాంటి పురోగతి లేదు. తొలుత రోడ్ల నిర్మాణంతో పాటు విద్యుత్, నీరు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉండగా ఇప్పటి వరకు అడుగు పడటం లేదు.
ఫ రెండున్నర సంవత్సరాల క్రితమే భూ సేకరణ పూర్తి
ఫ అప్పట్లోనే భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు
ఫ పార్కు అందుబాటులోకి వస్తే మెరుగుపడనున్న ఉపాధి అవకాశాలు
భూ సేకరణ కూడా పూర్తి కావడంతో త్వరలోనే ఇండస్ట్రియల్ పార్క్ అందుబాటులోకి వస్తుందని ఆశించాం. భూ సేకరణ పూర్తై రెండేళ్లు గడిచినా పార్క్ స్థలంలో ఇప్పటి వరకు ఇటుక కూడా వేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఏ దశలోనూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లకపోవడం వల్ల ప్రజల్లో నిరాశ నెలకొంది.
–డొంకెన రాజు, తుర్కపల్లి
ఇండస్ట్రియల్ పార్క్ అంశం స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టు పూర్తయితే ఎంతోమంది నిరుద్యోగులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోతే ఇండస్ట్రియల్ పార్క్ కల కాగితాల మీదే మిగిలిపోతుంది. ఇప్పటికై నా పట్టించుకొని పనులు ప్రారంభించాలి.
–ఇమ్మడి అనిల్‌కుమార్, తుర్కపల్లి
ఇండస్ట్రియల్ పార్కుపై పట్టింపేదీ!
ఇండస్ట్రియల్ పార్కుపై పట్టింపేదీ!


