నేడు పాఠశాలలకు సెలవు
భువనగిరి: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు గురువారం కూడా సెలవు ప్రకటించినట్లు డీఈఓ సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, రవాణా వ్యవస్థకు ఆ టంకం ఏర్పడుతుందని, విద్యార్థులు ఇబ్బందులు పడవద్దన్న ఉద్దేశంతో కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు డీఈఓ వెల్లడించారు.
నేడు ప్రత్యేక గ్రీవెన్స్ రద్దు
భువనగిరిటౌన్ : కలెక్టరేట్‌లో గురువారం జరగాల్సిన ప్రత్యేక గ్రీవెన్స్‌ను రద్దు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వచ్చే గురువారం యథావిధిగా గ్రీవెన్స్ ఉంటుందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
స్లాట్ బుక్ చేయొద్దు
రాజాపేట: పత్తి అమ్మకాల కోసం కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకున్న రైతులు వాటిని రద్దు చేసుకోవాలని రాజాపేట మండలం వ్యవసాయ అధికారి పద్మలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల కారణంగా మార్కెటింగ్ శాఖ, సీసీఐ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వర్షాలు తగ్గిన తరువాత జిల్లా అధికారులు తదుపరి ప్రకటన చేస్తారని, అప్పటి వరకు స్లాట్ బుక్ చేసుకోవద్దని సూచించారు.
ఆరెగూడెం పంచాయతీ రికార్డులు స్వాధీనం
చౌటుప్పల్ రూరల్: మండలంలోని ఆరెగూడెం గ్రామ పంచాయతీ రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి సురేష్, సిబ్బంది జి.శ్రీశైలం, కె.రత్నయ్య అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, గ్రామ సభల్లో తీర్మానాలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామస్తులు పలువురు గత నెల 1న కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చౌటుప్పల్ ఎంపీఓ అంజిరెడ్డి బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం డీపీఓకు నివేదిక అందజేస్తామని ఎంపీఓ తెలిపారు.
పథకాలపై అవగాహన
భువనగిరిటౌన్ : బ్యాంకుల ద్వారా ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటంతోపాటు, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కెనరా బ్యాంక్ ప్రధాన కార్యాలయం డిప్యూటీ జనరల్ మేనేజర్ సుబ్బారావు పేర్కొన్నారు. ఆర్థిక అక్షరాస్యత, జన సురక్ష, పీఎం స్వనిధి పథకాలపై బుధవారం భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో లీడ్ బ్యాంక్, మెప్మా సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి మహిళ ఆర్థిక అక్షరాస్యత సాధించాలన్నారు. అనంతరం డిజిటల్ మోసాల నియంత్రణపై అవగాహన కల్పించారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ శివ రామకృష్ణ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేష్ బాబు, మెప్మా కోఆర్డినేటర్ శ్యామల, కెనరా బ్యాంకు రీజినల్ మేనేజర్ శాంతికుమార్, చీఫ్ మేనేజర్ మిథిన్‌రాజ్, మహిళా సంఘాల సభ్యులు, వీధి వ్యాపారులు, మెప్మా రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.
ప్రజల్లో చైతన్యం తేవాలి
చౌటుప్పల్: స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని డీజీపీ శివధర్‌రెడ్డి సూ చించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి తంగడపల్లికి చెందిన ఎంవీ ఫౌండేషన్ ప్రతినిధులు బుధవారం హైదరాబాద్‌లోని కార్యాలయంలో డీజీపీని కలిశారు. శాలువాతో సత్కరించారు. సన్మానపత్రం అందజేశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ఆ యనకు వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, సైబర్ నేరాల నియంత్రణపై గ్రామీణ ప్రజల్లో అవగాహన పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు సహకారం అందించాలని డీసీపీ తమకు సూ చించినట్లు నిర్వాహకులు తెలిపారు. డీజీపీని కలిసిన వారిలో ఎంవీ ఫౌండేషన్ చైర్మన్ ముటుకుల్లోజు వెంకటేశ్వరాచారి, ప్రతినిధులు గ్యార కృష్ణ, రాజుల ఆంజనేయులు ఉన్నారు.
తహసీల్దార్ కార్యాలయం తనిఖీ
బొమ్మలరామారం : మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆకస్మీక తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా చర్య తీసుకోవాలని, రైతులకు టార్పాలిన్‌లు ఇవ్వాలని ఆదేశించారు.


