ఇందిరమ్మ ఇళ్లతో ‘ఉపాధి’
లబ్ధిదారులకు ప్రయోజనం
ఉపాధిహామీ జాబ్ కార్డు కలిగిన లబ్ధిదారులను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించుకునేందుకు ఎంపీడీఓలు జాబితా తయారు చేస్తారు. జాబితాను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులకు పంపి అనుమతి తీసుకుంటారు. అనంతరం గృహనిర్మాణ శాఖ పీడీకి నివేదిస్తారు. ఇప్పటికే 972 మందిని లబ్ధిదారులను గుర్తించగా.. వారంతా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు.
ఆలేరురూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉపాధిహామీ జాబ్ కార్డు కలిగిన లబ్ధిదారులను వినియోగించుకుంటున్నారు. రోజుకు రూ.370 చెల్లించి 90 రోజుల పాటు పనిదినాలు కల్పిస్తున్నారు. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి సంకల్పించిన ప్రభుత్వం.. ఈ మేరకు నిర్ణయం తీసకుంది. ఇప్పటికే 972 మంది లబ్ధిదారులను గుర్తించగా.. వారంతా పనుల్లో పాల్గొంటున్నారు.
లబ్ధిదారులకు తొలగనున్న ఇబ్బందులు
జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి రూ.3,500 ఇళ్లు మంజూరయ్యాయి. కాగా లబ్ధిదారుల్లో చాలా మంది ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. ప్రారంభించిన చోట పనుల్లో పురోగతి లేదు. ప్రధానంగా కూలీల కొరత వెంటాడుతోంది. పనికి వచ్చిన కూలీలు రోజుకు రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు డిమాండ్ చేశారు. అంత కూలి చెల్లించలేక లబ్ధిదారులు ఆర్థికంగా సతమతం అవుతున్నారు. ఫలితంగా ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం జరుగుతోంది. సమస్యను అధిగమించేందుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఉపాధిహామీ జాబ్ కార్డు కలిగిన వారికి 90 రోజుల పనిదినాలు కల్పించాలని నిర్ణయించింది. రోజుకు రూ.307 చొప్పున కూలి చెల్లించనున్నారు.
పనిదినాల విభజన ఇలా..
90 పనిదినాల్లో.. బేస్‌మెంట్ లెవల్ వరకు 40, స్లాబ్ వరకు 50 రోజుల చొప్పున వినియోగించుకోవచ్చు. ఇంటి నిర్మాణంలో పాల్గొనే లబ్ధిదారులకు వారం రోజుల్లో వారి ఖాతాలో వేతనం జమ చేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనుసంధానం చేసిన లబ్ధిదారులు ఇతర పనులకు వెళ్లే అవకాశం ఉండదు. ప్రభుత్వ నిర్ణయంతో ఎక్కువ మంది కూలీలకు పని లభించనుంది.
ఈజీఎస్‌తో అనుసంధానం
ఫ జాబ్‌కార్డు కలిగిన లబ్ధిదారులకు 90 రోజుల పనిదినాలు
ఫ జిల్లాలో 972 మంది గుర్తింపు
ఫ ఒక్కొక్కరికి రోజుకు రూ.307 వేతనం
జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల్లో ఉపాధిహామీ జాబ్ కార్డులు ఉన్నవారిని 972 మందిని గుర్తించాం. వారికి 90 రోజల పనిదినాలు కల్పించి, రోజుకు రూ.307 వేతనం చెల్లిస్తాం. వారం రోజుల్లోనే లబ్ధిదారుల ఖాతాలో వేతనం డబ్బులు జమ అవుతాయి. ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది
–నాగిరెడ్డి డీఆర్‌డీఓ
ఇందిరమ్మ ఇళ్లతో ‘ఉపాధి’


