చేలలో కన్నీళ్లు
ఇప్పటికే వరుస వానలతో కోలుకోలేని స్థితిలో ఉన్న రైతులను.. మోంథాన్ మరింత దెబ్బతీసింది. ముఖ్యంగా చేతికొచ్చిన పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. మూసీ ఆయకట్టుతో పాటు నాన్ ఆయకట్టులోనూ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. చాలా చోట్ల వరి కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో కొందరు రైతులు అప్రమత్తమై ధాన్యంపై టార్పాలిన్లు కప్పి తడవకుండా కాపాడుకున్నారు. కొన్ని కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, పల్లపు ప్రాంతాల్లో కేంద్రాలు నిర్వహిస్తుండటంతో ధాన్యం రాశుల కిందకు నీరు చేరింది. నీటిని తొలగించేందుకు రైతులు అవస్థలు పడ్డారు.ఇక పత్తి రైతు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కూలీల కొరత వల్ల ఏరకుండా చేలపైన ఉన్న పత్తి చాలా వరకు వర్షానికి నేలపాలైంది. కొంత రంగు మారినట్లు రైతులు వాపోయారు. పలుచోట్ల చేలలో నీరు నిలిచింది. వర్షాలు దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.


