పోరాట స్ఫూర్తితో ముందుకెళ్దాం
భువనగిరిటౌన్ : సీపీఐది త్యాగాల చరిత్ర అని.. అనేక పోరాటాలు, ఉద్యమ నిర్మాణంలో అగ్రస్థానంలో నిలిచిందని పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. వందేళ్ల ఉత్సాహం, పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బుధవారం భువనగిరిలోని సీపీఐ కార్యాలయంలో ఎండీ ఇమ్రాన్ అధ్యక్షతన జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్రో ద్యమంలో సీపీఐ ముందు నిలిచిందని, తెలంగాణ సాయుధ పోరాటం నడిపి రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదేనన్నారు. ఖమ్మంలో డిసెంబర్ 26న జరిగే సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ చారిత్రాక ఘట్టంగా మిగిలిపోనుందని, ప్రతి కార్యకర్త తరలిరావాలని కోరారు. మోంథా తుపానుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ రీజినల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులను ఆదుకోవాలని, 42 శాతం బీసీ రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి యా నాల దామోదర్ రెడ్డి, నాయకులు బోలగాని సత్యనారాయణ, చేడే చంద్రయ్య, గోద శ్రీరాములు, కొల్లూరి రాజయ్య, కళ్లెం కృష్ణ, బండి జంగమ్మ బచ్చనగోని గాలయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి


